
Encounter: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు , కోటి రివార్డున్న టాప్ మావోయిస్టు నేత మృతి
ఈ వార్తాకథనం ఏంటి
జార్ఖండ్‌లో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పోలీసు,సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సంయుక్త ఆపరేషన్‌లో ముగ్గురు ప్రధాన మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో కోటి రూపాయల రివార్డు ఉన్న అగ్ర మావోయిస్టు నాయకుడు సహదేవ్ సోరెన్ అలియాస్ ప్రవేశ్ కూడా ఉండటం గమనార్హం. ఈ ఘటనతో మావోయిస్టు ఉద్యమం తీవ్రంగా దెబ్బతిన్నట్లయింది. ఈ ఘటనా హజారీబాగ్ జిల్లాకు చెందిన గిర్హోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పానితిరి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం సుమారు 6 గంటలకు జరిగింది.
వివరాలు
రూ.25 లక్షలు, రూ.10 లక్షల రివార్డులున్న మరో ఇద్దరు కూడా హతం
సహదేవ్ సోరెన్ నేతృత్వంలోని మావోయిస్టు బృందం కదలికలపై భద్రతా బలగాలు పక్కా సమాచారం పొందిన తర్వాత, కోబ్రా కమాండోలు, గిరిడి, హజారీబాగ్ జిల్లాల పోలీస్ సిబ్బందితో కలసి కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆ క్రమంలో భద్రతా సిబ్బందికి, మావోయిస్టుల మధ్య తీవ్ర తుపాకీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆపరేషన్ ఫలితంగా ముగ్గురు మావోయిస్టులను బలవంతంగా మట్టుబెట్టినట్లు సీఆర్పీఎఫ్ ధృవీకరించింది. మృతులలో సహదేవ్ సోరెన్ (సెంట్రల్ కమిటీ సభ్యుడు, రూ. 1 కోటి రివార్డు), రఘునాథ్ హేంబ్రామ్ (స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు, రూ. 25 లక్షల రివార్డు) వీర్సేన్ గంఝూ (జోనల్ కమిటీ సభ్యుడు, రూ. 10 లక్షల రివార్డు) ఉన్నారని అధికారులు గుర్తించారు.
వివరాలు
రెండు రోజుల్లో రెండు ఎన్‌కౌంటర్లు.. కొనసాగుతున్న కూంబింగ్
ఘటనా స్థలంలో నుంచి మూడు ఏకే-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారని కూడా వెల్లడించారు. ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని, ఆ ప్రాంతంలో భద్రతా పరిశీలనలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. జార్ఖండ్‌లో మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్లలో భద్రతా బలగాలకు ఇది రెండు రోజుల్లో రెండో పెద్ద విజయం. ఆదివారం పలామూ జిల్లాలో జరిగిన మరొక ఎన్‌కౌంటర్‌లో రూ. 5 లక్షల రివార్డుతో ఉన్న టీఎస్‌పీసీ మావోయిస్టు నాయకుడు ముఖ్‌దేవ్ యాదవ్‌ను హతమార్చిన విషయం తెలిసిందే.