RailOne App: రైల్‌వన్ యాప్ ద్వారా జనరల్ టికెట్లపై 3 శాతం డిస్కౌంట్
ఈ వార్తాకథనం ఏంటి
రైల్వే వన్ మొబైల్ యాప్ ద్వారా జనరల్ (అన్‌రిజర్వ్డు) రైలు టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు టికెట్ ధరపై 3 శాతం డిస్కౌంట్ అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇటీవల భారతీయ రైల్వే ప్రారంభించిన ఈ యాప్ ద్వారా జనరల్ టికెట్ బుకింగ్‌ను మరింత సులభతరం చేయడంతో పాటు, నగదు రహిత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రాయితీని ప్రకటించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ సదుపాయం ఈ నెల 14 నుంచి జులై 14 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ యాప్‌పై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్‌లో రైల్వే వన్ మొబైల్ యాప్‌కు సంబంధించిన ప్రచార ఫ్లెక్సీ బోర్డును ఏర్పాటు చేశారు.
Details
ప్రతిరోజూ సుమారు 4 నుంచి 5 వేల వరకు జనరల్ టికెట్లు
ప్రస్తుతం రైల్వేస్టేషన్‌లోని జనరల్ టికెట్ బుకింగ్ కౌంటర్ల ద్వారా ప్రతిరోజూ సుమారు 4 నుంచి 5 వేల వరకు జనరల్ టికెట్లు, అలాగే 1,200 నుంచి 1,500 వరకు ప్లాట్‌ఫామ్ టికెట్లు ప్రయాణికులు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా పండగ సీజన్లలో జనరల్ బుకింగ్ కౌంటర్ల వద్ద భారీ రద్దీ నెలకొంటుండగా, క్యూలైన్లలో ప్రయాణికులు ఎక్కువ సేపు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే రైల్వే వన్ యాప్ వినియోగంతో ఈ ఇబ్బందులు ఇక తప్పనున్నాయి. ఈ యాప్ ద్వారా అన్‌రిజర్వ్డు టికెట్ల కొనుగోలును మరింత సులభతరం చేశారు. ప్రయాణికులు తమ ఇళ్ల వద్ద నుంచే ప్రయాణ టికెట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ టికెట్‌ను కూడా సులభంగా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.