Tamil Nadu: తమిళనాడులో కల్తీ మద్యం సేవించి 37 మంది మృతి
తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం సేవించి 37 మంది మరణించగా, మరో 100 మందికి పైగా ఆసుపత్రి పాలైనట్లు జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ వార్తా సంస్థ ANIకి ధృవీకరించారు. చనిపోయిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. చనిపోయిన వారిలో చాలా మందికి ఇప్పటికే పోస్ట్‌మార్టం జరిగింది. పోస్ట్‌మార్టం నివేదికపై వైద్యుల బృందం త్వరలో నివేదికను సమర్పించనుంది. మద్యం విక్రయిస్తున్న కన్నుకుట్టి ఉరఫ్ గోవిందరాజ్ అనే వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 200 లీటర్ల మద్యాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పరీక్షించిన తరువాత, నమూనాలలో మిథనాల్ ఉన్నట్లు కనుగొన్నారు.
సిబి-సిఐడి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం
ఈ ఘటనపై సిబి-సిఐడి విచారణకు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆదేశించారు.డీఎంకే ప్రభుత్వం కళ్లకురిచి జిల్లా కలెక్టర్ శ్రావణ్ కుమార్ జాతావత్‌ను బదిలీ చేయడంతోపాటు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సమయ్ సింగ్ మీనాను సస్పెండ్ చేసింది. రాష్ట్ర మంత్రి ఈవీ వేలు ప్రకారం,కల్తీ మద్యం సేవించడం వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలయ్యారు. జూన్ 18న,కళ్లకురిచి జిల్లాలోని కరుణాపురం నుండి రోజువారీ కూలీలు,ప్యాకెట్లు,సాచెట్‌లలో విక్రయించే నకిలీ మద్యాన్ని సేవించినట్లు అధికారులు తెలిపారు. వారిలో చాలా మందికి విరేచనాలు,వాంతులు, కడుపు నొప్పి, కళ్ళలో మంట వంటి లక్షణాలు కనిపించడం ప్రారంభించాయి. అనంతరం వారిని ఆసుపత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిని కళ్లకురిచ్చి,సేలం,విల్లుపురం,పుదుచ్చేరిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్పించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
డీఎంకే ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు,గవర్నర్ విమర్శలు
మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. కల్తీ మద్యం కారణంగా ఇప్పటికే అనేక మంది మరణించినప్పటికీ,కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని తమిళనాడు ప్రతిపక్ష నేత ఎడప్పాడి కె పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో విఫలమైనందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి ఎస్ ముత్తుసామి రాజీనామా చేయాలని తమిళనాడు బిజెపి చీఫ్ కె అన్నామలై డిమాండ్ చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి కూడా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 'అప్పుడప్పుడూ కల్తీ మద్యం సేవించడం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ప్రాణనష్టం జరుగుతోందన్నారు. అక్రమ మద్యం వినియోగాన్ని నిరోధించడంలో నిర్లక్ష్యం జరుగుతోందన్నారు. ఇది తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమన్నారు.