Amaravati: రాజధానిలో 31 సంస్థలకు భూకేటాయింపుల కొనసాగింపు.. 13 సంస్థలకు రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
రాజధాని అమరావతిలో గతంలో 31 సంస్థలకు కేటాయించిన 629.36 ఎకరాల భూమిని యథావిధిగా కొనసాగించాలని, మరో 13 సంస్థలకు కేటాయించిన 177.24 ఎకరాల భూమిని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
భూమి కేటాయింపులు కొనసాగుతున్న సంస్థలకు నిర్మాణ గడువును అదనంగా రెండేళ్లు పెంచింది.
2014 నుండి 2019 మధ్య కాలంలో అమరావతిలో జరిగిన భూ కేటాయింపులను ప్రభుత్వం సమీక్షిస్తోంది.
ఈ మేరకు, కొత్త భూ కేటాయింపుల పరిశీలనతో పాటు, గత కేటాయింపుల సమీక్ష కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.
వివరాలు
69 ప్రభుత్వ సంస్థలు, 61 ప్రైవేటు సంస్థలు
ఇప్పటికే మూడు సమావేశాలు నిర్వహించిన ఉపసంఘం, గతంలో భూమిని పొందిన 13 సంస్థలకు కేటాయింపులను రద్దు చేయాలని, మరో 31 సంస్థలకు కొనసాగించాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయానికి మంత్రివర్గ సమావేశం మార్చి 17న ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 2014-19 మధ్య మొత్తం 130 సంస్థలకు 1277.68 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
వీటిలో 69 ప్రభుత్వ సంస్థలు, 61 ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. భూకేటాయింపులను కొనసాగించనున్న 31 సంస్థలను మూడు విభాగాలుగా విభజించారు.
అప్పట్లో రాజధానిలో రెండు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఒకదానికి 5 ఎకరాలు, మరొకదానికి 8 ఎకరాలు కేటాయించారు.
మొత్తం భూమిని 60 ఏళ్ల పాటు లీజుకు ఒక్క రూపాయికే కేటాయించాలని ప్రతిపాదించారు.
వివరాలు
11 సంస్థలతో త్వరలో ఒప్పందం
తాజా సమావేశంలో ఒక కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు.
దీనిని మొదటి విభాగంలో చేర్చి, సీఆర్‌డీఏ కమిషనర్ సవరించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేయనున్నారు.
భూమి కేటాయింపులను కొనసాగించనున్న సంస్థల్లో 11 సంస్థలు ఇప్పటి వరకు సీఆర్‌డీఏతో విక్రయ లేదా లీజు ఒప్పందాలు చేసుకోలేదు.
వీటికి త్వరలో లెటర్ ఆఫ్ ఇన్విటేషన్ జారీ చేయనున్నారు. ఈ లేఖ అందుకున్న 30 రోజుల్లోగా సంబంధిత ఒప్పందాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ జాబితాలో తితిదేకు కేటాయించిన 25 ఎకరాల భూమిలో ఆలయ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది.
వివరాలు
భూమి కేటాయింపులు రద్దైన సంస్థలు
రాజధానిలో భూమిని పొందినా, నిర్మాణ పనులు ప్రారంభించని లేదా ఆసక్తి కనబరచని 13 సంస్థలకు భూకేటాయింపులను రద్దు చేశారు.
వీటిలో బీఆర్‌ఎస్ మెడిసిటీ, ఇండో-యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఐయూఐహెచ్) సంస్థలు ప్రాజెక్టుల్ని ప్రారంభించకపోవడం, అనేక మార్లు లేఖలు పంపినా స్పందించకపోవడంతో, 2019కి ముందే అప్పటి తెదేపా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
ఆంధ్రా బ్యాంక్, సిండికేట్ బ్యాంకులు విలీనమైనందున, వాటికి కేటాయించిన భూమిని రద్దు చేశారు.
వివరాలు
19 సంస్థలకు గడువు పొడిగింపు
ఇప్పటికే విక్రయ లేదా లీజు ఒప్పందాలు చేసుకున్న 19 సంస్థలకు ప్రాజెక్టుల అమలు గడువును 2027 మార్చి 31 వరకు పొడిగించాలని నిర్ణయించారు.
వీటిలో ఎస్‌ఆర్‌ఎం, విట్, అమృత యూనివర్సిటీలు ఇప్పటికే నిర్మాణ పనులను పూర్తి చేశాయి.
ఎస్‌ఆర్‌ఎం, విట్‌లలో ఇంజినీరింగ్, పీజీ కోర్సులు పూర్తయి, కొన్ని బ్యాచ్‌లు ఇప్పటికే విద్యాభ్యాసాన్ని ముగించాయి.
ఎన్‌ఐడీ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్) నిర్మాణం కూడా ఎక్కువ శాతం పూర్తయింది.