AP floods: ఏపీలో భారీ వర్షాల కారణంగా మృతి చెందినవారి సంఖ్య విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వర్షాలు, వరదల బీభత్సం తీవ్రతను 4 సెప్టెంబర్ సాయంత్రం 7 గంటలకు విడుదల చేసిన అధికారిక బులిటెన్ లో ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రకటన ప్రకారం, వరదల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 మంది మృతి చెందగా,ఎన్టీఆర్ జిల్లాలోనే 24 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక సమాచారం. గుంటూరు జిల్లాలో 7 మంది మరణించగా, పల్నాడు జిల్లాలో ఒకరు చనిపోయారని పేర్కొంది. వరదల కారణంగా 1,69,370 ఎకరాల్లో పంటలు, 18,424 ఎకరాల్లో ఉద్యానవన పంటలు నష్టపోయినట్లు వెల్లడించబడింది. మొత్తం 2 లక్షల 34 వేల మంది రైతులు పంట నష్టానికి గురైనట్లు వెల్లడించారు. అదేవిధంగా, 60 వేల కోళ్లు, 222 పశువులు వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు.
50 ఎన్డీఆర్‌ఎఫ్,ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు
22 కరెంట్ సబ్ స్టేషన్‌లు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. 3,973 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయి, 78 చెరువులకు గండ్లు పడ్డాయని వెల్లడించారు. వర్షాలు,వరదల కారణంగా 6,44,536 మంది పౌరులు నష్టపోయారని, 193 రిలీఫ్ క్యాంపులలో 42,707 మంది శరణార్థులుగా ఉన్నారని తెలిపారు. వీరికి సహాయంగా 50 ఎన్డీఆర్‌ఎఫ్,ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సేవలు అందిస్తున్నాయి. కృష్ణా నదికి ప్రస్తుతం 3 లక్షల 16 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోందని ప్రభుత్వం వెల్లడించింది.
విజయవాడలో పునరుద్ధరణ కార్యక్రమాలు
విజయవాడ వరదల బీభత్సానికి గణనీయంగా నష్టపోయింది. రోడ్లు, ఇళ్ళు అన్న తేడా లేకుండా.. నదులు,వాగులు నగరాన్ని ముంచెత్తాయి. వరద తగ్గినప్పటికీ, బురద మరింత సమస్యగా మారింది. నగరంలోని ప్రతి ప్రదేశంలో బురద, చెత్త కనిపిస్తోంది.జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లపై నడవడం కూడా కష్టసాధ్యంగా మారింది. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం పారిశుధ్య కార్యక్రమాలపై దృష్టి సారించింది. నగరాన్ని శుభ్రం చేసి పునరుద్ధరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
వారం రోజుల్లో విజయవాడను యథాస్థితికి..
వివిధ మున్సిపాలిటీల నుంచి కార్మికులను విజయవాడకు తరలించి, బురద ,చెత్తను శుభ్రం చేసే పనులను వేగంగా పూర్తి చేయిస్తోంది. 20 ఫైరింజన్లు, 900 మంది శానిటేషన్ కార్మికులు క్లీనింగ్ పనుల్లో నిమగ్నమయ్యారు. బురద తొలగింపు, బ్లీచింగ్, ఫాగింగ్ వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 63 మంది ప్రత్యేక అధికారులను నియమించారు.. వారు పనులను పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం , వారం రోజుల్లో విజయవాడను యథాస్థితికి తీసుకొస్తామని తెలిపింది.