Tamilnadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..బహుళ వాహనాలు ఢీకొని నలుగురు మృతి, 8 మందికి గాయాలు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మపురి జిల్లా తోప్పూర్ ఘాట్ రోడ్డు వద్ద బుధవారం ఓ వంతెనపై బహుళ వాహనాలు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడి చికిత్స పొందుతున్న వారికి రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యిన దృశ్యాలలో వేగంగా దూసుకొస్తున్న ఓ ట్రక్కు ఎదురుగా వస్తున్న ట్రక్కు మరో ట్రక్కును ఢీకొట్టింది. ఈ ధాటికి రెండు ట్రక్కుల మధ్య చిక్కుకున్న కారు నుజ్జునుజ్జు కాగా, మరో వాహనం అదుపు తప్పి వంతెనపై నుంచి పడిపోయింది.
పెండింగ్‌లో ఉన్న ఎలివేటెడ్ నేషనల్ హైవే పనులు
ఇంతలోనే ఓ ట్రక్కులో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంపై ధర్మపురి డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ స్పందిస్తూ.. పెండింగ్‌లో ఉన్న ఎలివేటెడ్ నేషనల్ హైవే పనులను పూర్తి చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయన్న భయంతోనే తాము ధర్మపురిలోని తోప్పూర్ ఘాట్ సెక్షన్ వద్ద మంజూరైన ఎలివేటెడ్ హైవేని సత్వరమే అమలు చేయాలని పట్టుబడుతున్నామని ఆయన అన్నారు.