Australia: ఆస్ట్రేలియా వర్కింగ్ హాలిడే మేకర్ వీసా.. 1,000 వీసాలకు 40వేల దరఖాస్తులు
ఆస్ట్రేలియా ప్రవేశపెట్టిన వర్కింగ్ హాలిడే మేకర్ వీసా కార్యక్రమానికి భారతీయుల నుండి అపార స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో 1000 వీసాలను అందుబాటులో ఉంచారు. వీసాల కోసం అక్టోబర్ 1 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కానీ కేవలం రెండు వారాల వ్యవధిలోనే 40,000 మంది భారతీయులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ శాఖ సహాయమంత్రి మాట్ థిస్ట్‌వైట్ వెల్లడించారు.
తొలి విడత వీసాల కోసం ఇంకా రెండు వారాల సమయం
వర్కింగ్ హాలిడే మేకర్ వీసా ద్వారా వారు 12 నెలల పాటు ఆస్ట్రేలియాలో ఉండేందుకు అనుమతిని పొందుతారు. ఆ సమయంలో వారు ఉద్యోగం చేసుకోవడానికి, చదువు కొనసాగించడానికి లేదా నివసించేందుకు వీలుగా ఉంటుందన్నారు. ఈ వీసా కోసం వయసు పరిమితిని 18-30 ఏళ్లుగా నిర్ణయించారు. వీసా పొందిన వారు వచ్చే ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాకు ప్రయాణం చేయవచ్చు. తొలి విడత వీసాల కోసం ఇంకా రెండు వారాల సమయం ఉండటంతో మరింత మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఎంపిక ప్రక్రియను ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్టోబర్ 14 నుండి ఏప్రిల్ 30, 2025 మధ్య ర్యాండమ్‌గా నిర్వహిస్తారు. ఎంపికైన దరఖాస్తుదారులకు ఇ-మెయిల్ ద్వారా సమాచారం అందజేస్తారు.
రిజిస్ట్రేషన్ కోసం ముందుగా..
"ఈ వీసా కార్యక్రమం 18-30 ఏళ్ల మధ్య వయసున్న 1000 మంది భారతీయ యువతకు ఒక సంవత్సరానికి ఉద్యోగం, విద్య లేదా ఆస్ట్రేలియాలో జీవనశైలిని అనుభవించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది రెండు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తుంది," అని మాట్ థిస్ట్‌వైట్ తెలిపారు. ఏడాదికి 1,000 వీసాలను జారీ చేయనున్నామని, ఈ వీసా ధర 650 డాలర్లుగా నిర్ణయించామని చెప్పారు. భారతీయ యువతకు ఇది గొప్ప అవకాశం అని ఆయన అభివర్ణించారు. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా 25 డాలర్లను చెల్లించాల్సి ఉంటుందని, దరఖాస్తుదారుల ఆరోగ్యం, వ్యక్తిత్వం, ప్రవర్తన ఆధారంగా ఎంపిక జరుపుతామని వివరించారు.
ఆస్ట్రేలియా పర్యటనలో పీయూష్ గోయెల్
ఇటీవల కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్, ఆస్ట్రేలియా పర్యటనలో ఈ వీసా కార్యక్రమానికి సంబంధించిన అంశాలను చర్చించారు. ఆయన ఆస్ట్రేలియాలో పర్యటించిన తరువాత వీసా గురించి పూర్తిగా వివరాలు వెల్లడించారు.