
Coal Missing:వర్షం వల్ల 4000 టన్నుల బొగ్గు కొట్టుకుపోయింది..! రాష్ట్ర మంత్రి విచిత్ర వివరణ
ఈ వార్తాకథనం ఏంటి
ఈశాన్య భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలో ఇటీవల సుమారు 4 వేల టన్నుల బొగ్గు అనూహ్యంగా అదృశ్యమైంది. ఈ ఘటనపై విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బొగ్గు అదృశ్యమవడంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, దానికి బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. ఈ పరిణామాలపై రాష్ట్ర మంత్రి కీర్మెన్ షిల్లా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. భారీ వర్షాల కారణంగా ఆ బొగ్గు మేఘాలయ రాష్ట్ర సరిహద్దులు దాటి, బంగ్లాదేశ్ లేదా అస్సాం ప్రాంతాలకు కొట్టుకుపోయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు
వాస్తవానికి, మేఘాలయలోని రాజాజు,దియంగన్ గ్రామాల్లో ఉన్న రెండు బొగ్గు నిల్వ కేంద్రాల నుంచి ఇటీవల సుమారు 4,000 టన్నుల బొగ్గు మాయమైంది. ఈబొగ్గు అక్రమంగా తరలించబడి ఉండొచ్చన్న అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో,హైకోర్టు ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈనేపథ్యంలో స్పందించిన ఎక్సైజ్ శాఖ మంత్రి కీర్మెన్ షిల్లా మాట్లాడుతూ.. "నేను ఏ తప్పును సమర్థించట్లేదు. కానీ ఒక విషయం గమనించాలి.మేఘాలయ రాష్ట్రం దేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటి.ఇక్కడ వర్షాలు చాలా తీవ్రంగా పడతాయి.వర్షాల ప్రభావంతో మేఘాలయకు పొరుగు రాష్ట్రాల్లో వరదలు సంభవిస్తున్నాయని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ బొగ్గు కూడా వర్షపు ప్రవాహంలో అస్సాం లేదా బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోయి ఉండవచ్చు" అని అన్నారు.
వివరాలు
రాజకీయంగా తీవ్ర దుమారానికి కారణమైన మంత్రి వ్యాఖ్యలు
అయితే, ఈ విషయంలో కేవలం వర్షాన్నే నిందించలేం. బొగ్గు అక్రమ రవాణా జరిగినట్లు ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాల్లేవు. అయితే ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఎవరైనా అక్రమంగా మైనింగ్‌కు పాల్పడినట్టు తేలితే, వారికి సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం తప్పనిసరిగా జరుగుతుంది'' అని ఆయన స్పష్టం చేశారు. అయితే మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. బొగ్గు అక్రమ రవాణాను కప్పిపుచ్చేందుకు మంత్రి వర్షాల పేరుతో తప్పుదారి పట్టే వివరణ ఇస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్‌కి అనుకూల వాతావరణం ఏర్పడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.