
Telangana: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల్లో 41 లక్షల మంది అనర్హులే
ఈ వార్తాకథనం ఏంటి
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం తుది జాబితాలను సిద్ధం చేసింది.
మొత్తంగా 77.18 లక్షల మంది దరఖాస్తు చేయగా, ఇందులో 36.03 లక్షల మంది (46.7 శాతం) అర్హులుగా తేల్చారు. మిగతా 41.15 లక్షల మంది (53.3 శాతం) అనర్హులుగా గుర్తించడం విశేషం.
ప్రభుత్వం నిబంధనల ప్రకారం, అనర్హులంతా దారిద్య్రరేఖ (బీపీఎల్)కు ఎగువన ఉన్నవారని నిర్ధారించింది. అర్హులు, అనర్హుల వివరాలను గృహనిర్మాణశాఖ ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాలుగా వేరు చేశారు.
Details
ప్రతేడాది గరిష్ఠంగా 4.50 లక్షల ఇళ్లు
ప్రతి ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి 3,500 ఇళ్లు చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా ఏటా గరిష్ఠంగా 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇందిరమ్మ యాప్ ద్వారా వివరాల నమోదు
ఇళ్ల దరఖాస్తుల వివరాలను ఇందిరమ్మ యాప్‌లో నమోదు చేశారు. యాప్‌లో పొందుపరిచిన మార్గదర్శకాల ప్రకారం అన్ని కోణాల్లో సర్వేలు చేపట్టారు.
ఇక ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి కుటుంబ సర్వే ఆధారంగా దరఖాస్తుదారులను ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాల్లో విడదీశారు.
Details
ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాల వివరాలు
ఎల్-1 జాబితా
సొంత స్థలాలు ఉన్నా ఇళ్లు లేని వారు, పూరిళ్లు, మట్టిమిద్దెలు, రేకుల ఇళ్లు ఉన్నవారు - 23.05 లక్షల దరఖాస్తుదారులు.
ఎల్-2 జాబితా
స్థలాలు, ఇళ్లు లేని వారు - 21.44 లక్షల దరఖాస్తుదారులు.
ఎల్-3 జాబితా
ప్రభుత్వ ఉద్యోగులు, సొంత ఇళ్లు ఉన్నవారు, కార్లు కలిగిన వారు, దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు - 32.69 లక్షల దరఖాస్తుదారులు.
గత ఫిబ్రవరిలోనే మొదటి జాబితాను సిద్ధం చేశారు. అయితే పలు ఫిర్యాదులు రావడంతో, ప్రభుత్వం మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి జాబితాలను తాజాగా సిద్ధం చేసింది.
Details
పెరిగిన అనర్హుల సంఖ్య
క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అనర్హుల సంఖ్య 41.15 లక్షలకు పెరిగింది. నిబంధనల ప్రకారం ఎల్-3 జాబితాలో ఉన్నవారంతా అనర్హులుగా పరిగణిస్తారు.
తాజాగా ఎల్-1 జాబితాలో 18.67 లక్షల మంది, ఎల్-2 జాబితాలో 17.36 లక్షల మంది అర్హులుగా గుర్తించారు.
ప్రభుత్వం గ్రామాల, పట్టణాభివృద్ధి సంస్థల, పురపాలికల వారీగా అర్హులు, అనర్హుల జాబితాలను పూర్తిగా సిద్ధం చేసింది.