
TGSRTC: త్వరలో ఆర్టీసీకి ఎక్స్‌ప్రెస్‌లు, డీలక్స్‌లు సహా మొత్తం 422 కొత్త బస్సులు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఆర్టీసీ)త్వరలో 422కొత్త బస్సులను ప్రయాణికుల సేవలోకి తీసుకురానుంది. ఇందులో పల్లె వెలుగు తరహా సేవల నుంచి డీలక్స్ వరకు నాలుగు విభిన్న రకాల బస్సులు ఉండనున్నాయి. ఇప్పటికే కాలం చెల్లిన పాత బస్సులను సేవల నుంచి తప్పించి,వాటి స్థానంలో ఈ కొత్త బస్సులను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రయాణీకుల సంఖ్య అధికంగా ఉండే కొన్ని ముఖ్య రూట్లపై అదనంగా సర్వీసులు నిర్వహించే యోచన కూడా సంస్థలో ఉంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు,నగరాల వైపు ప్రయాణించే పల్లె వెలుగు,ఎక్స్‌ప్రెస్ బస్సులకు విస్తృతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా 'మహాలక్ష్మి' పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వలన ఈ బస్సుల్లో ఎప్పటికప్పుడు రద్దీ కనిపిస్తోంది.
వివరాలు
కొత్త బస్సుల ద్వారా పల్లెలకు,పట్టణాలకు.. మరిన్ని సౌకర్యవంతమైన సర్వీసులు
కొన్ని బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 100 నుంచి 120 శాతం వరకు నమోదవుతోంది. ఈ పరిస్థితిలో కొత్త బస్సుల ప్రారంభంతో ఆర్టీసీకి, ప్రయాణికులకు కొంత మేర ఉపశమనం లభించనుంది. గత ఏడాది సంస్థ మొత్తం 1,150 కొత్త బస్సులను కొనుగోలు చేయగా,వాటిలో 728 బస్సులు ఇప్పటికే రోడ్డెక్కాయి. ఇప్పుడు రానున్న మిగిలిన 422 బస్సులలో,294 పల్లె వెలుగు సేవలు,88 మెట్రో డీలక్స్ (హైదరాబాద్‌లో సేవలందించేవి), 23 డీలక్స్‌లు, 17 ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి. డీలక్స్ బస్సులు ప్రధానంగా పట్టణాల నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కి, అలాగే జిల్లాల మధ్య ప్రధాన రూట్లలో ప్రయాణికులకు సేవలు అందిస్తాయి. ఈ కొత్త బస్సుల ద్వారా పల్లెలకు, పట్టణాలకు మరిన్ని సౌకర్యవంతమైన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
వివరాలు
పాత బస్సులపై ఆర్టీసీ నిర్ణయం..13-15 లక్షల కిలోమీటర్లు దాటితే బస్సులకు విరామం
హైదరాబాద్,వరంగల్ నగరాల్లో నడుస్తున్న మెట్రో ఎక్స్‌ప్రెస్,మెట్రో డీలక్స్,సిటీ ఆర్డినరీ వంటి బస్సులు 13లక్షల కిలోమీటర్లు ప్రయాణించాక లేదా 15ఏళ్ల పైబడిన తర్వాత ఆ బస్సులను సేవల నుంచి తొలగించాలన్న నిర్ణయం ఆర్టీసీ తీసుకుంది. జిల్లాలలో నడిచే పల్లె వెలుగు బస్సులకు ఈ గరిష్ట పరిమితి 15 లక్షల కిలోమీటర్లుగా ఉండగా, ఎక్స్‌ప్రెస్,డీలక్స్,సూపర్ లగ్జరీ,ఏసీ బస్సులకు 10లక్షల కిలోమీటర్లు వరకు అనుమతిస్తున్నారు. ఈ పరిమితిని దాటిన తరువాత పాత బస్సులను తొలగించి వాటి స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెడుతోంది. ఈ చర్య వల్ల ప్రయాణ సౌలభ్యం మెరుగవడంతో పాటు, సంస్థ నిర్వహణ భారం కూడా తగ్గనుంది. ఈ నేపథ్యంలో రానున్న కొత్త బస్సులు ఆర్టీసీకి, ప్రయాణికులకు ఊరట కలిగించే అవకాశముంది.