Page Loader
Rekha Gupta: 5 టీవీలు,14 ఏసీలు..ఢిల్లీ ముఖ్యమంత్రి  బంగ్లా పునరుద్ధరణకు రూ.60 లక్షలు
5 టీవీలు,14 ఏసీలు..ఢిల్లీ ముఖ్యమంత్రి బంగ్లా పునరుద్ధరణకు రూ.60 లక్షలు

Rekha Gupta: 5 టీవీలు,14 ఏసీలు..ఢిల్లీ ముఖ్యమంత్రి  బంగ్లా పునరుద్ధరణకు రూ.60 లక్షలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2025
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు రాజధానిలోని రాజ్ నివాస్ మార్గ్‌లో అధికారిక నివాసం కేటాయించబడింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ అధికారిక నివాసం కేటాయింపు ఆలస్యంగా జరగడం గమనార్హం. ప్రస్తుతం ఆమె తన సొంత నియోజకవర్గమైన షాలిమార్ బాగ్‌లోని ఇంటిలో నివాసముంటున్నారు. అయితే, అధికారిక నివాసంగా ఇచ్చిన బంగ్లాలో మరమ్మతుల కోసం దాదాపు రూ.60 లక్షలు ఖర్చు చేయనున్నారు. జూన్ 28న విడుదలైన టెండర్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇందులో భాగంగా, రూ.9.3 లక్షల విలువగల ఐదు టెలివిజన్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) విడుదల చేసిన టెండర్ నోటీసు ప్రకారం, బంగ్లా మరమ్మత్తు పనులు రెండు నెలల కాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది.

వివరాలు 

రూ.5.74 లక్షల వ్యయంతో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు 

ఇందులో విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించడమూ భాగంగా ఉంటుంది. ఈ పనులకు సంబంధించి టెండర్ బిడ్డింగ్ జూలై 4న జరగనుంది. ముఖ్యమంత్రికి రెండు బంగ్లాలు కేటాయించగా, బంగ్లా నంబర్ 1ను ఆమె నివాసంగా, బంగ్లా నంబర్ 2ను క్యాంప్ కార్యాలయంగా ఉపయోగించనున్నారు. ఈ రెండు బంగ్లాల్లో కలిపి రూ.7.7 లక్షల విలువైన 14 ఏసీలు అమర్చనున్నారు. అదనంగా రూ.5.74 లక్షల వ్యయంతో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే, నిరంతర విద్యుత్ సరఫరా కోసం రూ.2 లక్షల విలువగల యూపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఇంకా, రూ.1.8 లక్షల వ్యయంతో రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే 23 సీలింగ్ ఫ్యానులు అమర్చనున్నారు.

వివరాలు 

మాజీ సీఎం కేజ్రీవాల్ నివసించిన  భవనాన్ని"శీష్‌మహల్"గా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు

అలాగే రూ.85,000లతో ఓవెన్ టోస్ట్ గ్రిల్,రూ.77,000తో ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్, రూ.60,000తో డిష్‌వాషర్,రూ.63,000తో గ్యాస్ స్టవ్,రూ.32,000తో మైక్రోవేవ్‌లు,రూ.91,000తో ఆరు గీజర్లు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక,రూ.6.03 లక్షల వ్యయంతో ఇంటి మొత్తం ప్రాంగణంలో 115 లైటింగ్ సామగ్రి.. దీపాలు,వాల్ లైటర్లు,హ్యాంగింగ్ లైట్లు,అలాగే మూడు భారీ షాండ్లియర్లను ఏర్పాటు చేయనున్నట్లు టెండర్ వివరించబడింది. ఢిల్లీ సీఎం పదవిని చేపట్టిన రేఖా గుప్తా,మాజీ సీఎం కేజ్రీవాల్ నివసించిన 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని వివాదాస్పద బంగ్లాలో నివసించనని స్పష్టం చేశారు. ఈ భవనాన్ని ఆమె గతంలో "శీష్‌మహల్"గా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ భవనాన్నిఅధిక విలాసవంతంగా తీర్చిదిద్దారని ఆరోపిస్తూ ఆమె ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.