Operation Bhediya: బహరాయిచ్ లో.. 5 ఏళ్ల బాలికపై తోడేలు దాడి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు ఇంకా ఆగడం లేదు. అధికారులు 'ఆపరేషన్ భేడియా' అనే కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ, పూర్తిస్థాయిలో ఫలితాలు రాలేదు. జంతు నిపుణులు ఈ ఘటనలను వేర్వేరు కోణాల్లో విశ్లేషిస్తున్నారు. విక్రామ్‌సిన్హ్ జాహ్లా అనే వూల్ఫ్ బయాలాజిస్ట్ ప్రకారం, గుంపుగా తోడేళ్లు దాడి చేస్తున్నట్టు అటవీశాఖ భావించినా, ఇది ఒక ఒంటరి తోడేలు చేసిందని ఆయన చెబుతున్నారు. ఇటీవలి దాడులను పరిశీలిస్తే, గాయపడినవారి గాయాల స్వరూపం చూస్తే, ఒక్క తోడేలు మాత్రమే ఈ దాడులు చేస్తున్నట్లు అర్థమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గుంపుగా తోడేళ్లు దాడి చేస్తే మృతదేహాలు పూర్తిగా ఛిద్రమైపోయేవి. కానీ,ఈ దాడుల్లో మృతదేహాలపై తక్కువ గాయాలు మాత్రమే కనిపించాయి.
తోడేళ్లు కుక్కలతో క్రాస్ చేసిన హైబ్రీడ్లు ఎక్కువ
ఒంటరి తోడేలు కేవలం 5 నుంచి 6 కిలోల మాంసం మాత్రమే తినగలదని, గుంపు అయితే మరింత ఎక్కువ మాంసం తినగలదని ఆయన వివరించారు. ఇంకా, తోడేళ్లు సాధారణంగా మనుషులపై దాడి చేయవని ది ఇంటర్నేషనల్ వూల్ఫ్ సెంటర్ చెబుతోంది. అయితే, మనుషులు తోడేళ్లు నివసించే ప్రాంతాల్లోకి వెళ్లడంతో దాడుల ముప్పు పెరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో తోడేళ్లు కుక్కలతో క్రాస్ చేసిన హైబ్రీడ్లు ఎక్కువగా ఉన్నాయని, అవి భయంలేకుండా జనావాసాల్లోకి వస్తున్నాయని విక్రామ్‌సిన్హ్ చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు ఈ ఒంటరి తోడేలును గుర్తించి పట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచిస్తున్నారు.
ఐదేళ్ల చిన్నారిపై తోడేలు దాడి
ముఖ్యంగా తోడేళ్లు తినే కుందేళ్లు వంటి జంతువులు బహరాయిచ్ ప్రాంతంలో గణనీయంగా తగ్గిపోయాయని.. దీంతో అవి ఎటువంటి రక్షణ లేకుండా తిరిగే చిన్నారులను తేలికపాటి లక్ష్యాలుగా చేసుకొంటున్నాయని విక్రామ్‌సిన్హ్ చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు ఈ ఒంటరి తోడేలును గుర్తించి బంధించాలని ఆయన సూచించారు. తాజాగా నిన్న రాత్రి మహాసి తెహసిల్ ప్రాంతంలో ఐదేళ్ల చిన్నారిపై తోడేలు దాడి చేసి గాయపరిచింది.ప్రస్తుతం ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు తోడేళ్ల దాడుల్లో 10 మంది మరణించగా,దాదాపు 30 మందికిపైగా గాయపడ్డారు. గత రెండు రోజుల్లో ఒక చిన్నారిని కూడా ఈ జంతువు పొట్టన పెట్టుకుందని చెప్పారు.
భయంలో వందల గ్రామాలు
దీనిపై జిల్లా మేజిస్ట్రేట్ రాణి మాట్లాడుతూ.. చుట్టుపక్కల వందల గ్రామాలు భయంతో జీవిస్తున్నాయి. ప్రతీ నాలుగైదు రోజులకు కొత్త గ్రామంలో తోడేళ్ల దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని..అడవి జంతువులు కనిపిస్తే వెంటనే ఫారెస్టు డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.