
Prime Minister: మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో రూ.362 కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు దేశాల్లో అధికారికంగా పర్యటించగా,ఆ పర్యటనల ఖర్చు రూ.67కోట్ల వరకు చేరిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలియజేశాయి. 2021 నుండి 2024మధ్యకాలంలో మోదీ విదేశీ పర్యటనలపై మొత్తం రూ.295కోట్లు ఖర్చైనట్టు పార్లమెంటులో సమర్పించిన గణాంకాల్లో పేర్కొన్నారు. ఈఏడాది ఇప్పటివరకు అయిన ఖర్చు కలిపితే మొత్తం వ్యయం రూ.362కోట్లకు పెరిగినట్టు ఈ గణాంకాల ద్వారా తెలుస్తోంది. అయితే,ఈ లెక్కల్లో మారిషస్,సైప్రస్,కెనడా,క్రొయేషియా,ఘనా,ట్రినిడాడ్ అండ్ టొబాగో,అర్జెంటీనా, బ్రెజిల్,నమీబియా వంటి దేశాలకు జరిగిన పర్యటనల ఖర్చు వివరాలు పొందుపరచలేదని స్పష్టమవుతోంది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓ బ్రియాన్ అడిగిన ప్రశ్నకు స్పందనగా విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈ లిఖిత పూర్వక సమాచారం అందించారు.
వివరాలు
అత్యధిక వ్యయం ఫ్రాన్స్ పర్యటనలోనే
ఇటీవల జరిగిన విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చుల బిల్లులను సిద్ధం చేస్తున్నామని,పూర్తి ఖర్చును ఇంకా తేల్చలేదని మంత్రి రాజ్యసభకు వెల్లడించారు. ఈ సంవత్సరం మోదీ చేసిన విదేశీ పర్యటనలలో అత్యధిక వ్యయం ఫ్రాన్స్ పర్యటనపైనే జరిగింది. ఆ పర్యటన కోసం రూ.25 కోట్లు ఖర్చు చేసినట్టు గణాంకాల్లో పేర్కొన్నారు. 2023లో మోదీ చేసిన అమెరికా పర్యటనకు రూ.22 కోట్లు వ్యయం అయినట్టు తెలిపారు. 2024లో ప్రధానమంత్రి మొత్తం 16 దేశాల్లో పర్యటించగా, వాటికిగాను రూ.109 కోట్లు ఖర్చు చేశారు.