
PM Modi: 2040లో 50 మంది వ్యోమగాములు సిద్ధం చేయాలి.. శుభాంశు శుక్లాతో మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
భవిష్యత్తులో భారత్ చేపట్టబోయే గగన్‌యాన్ (Gaganyaan) ప్రాజెక్టు విజయవంతం కావడంలో భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష అనుభవాలు అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2040 నాటికి భారత్‌కు 40 నుంచి 50 మంది కొత్త వ్యోమగాములు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచం మొత్తం గగన్‌యాన్ మిషన్‌పై ఆసక్తి కనబరుస్తోందని, ఇందులో భాగం కావడానికి అనేక మంది శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారని శుక్లా ప్రధానికి వివరించారు. ప్రధాని మోదీతో తన భేటీకి సంబంధించిన విషయాలను శుక్లా మంగళవారం సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ శుభాంశు అంతరిక్ష యాత్రతో గగన్‌యాన్ ప్రాజెక్టు తొలి అడుగు పడిందని పేర్కొన్నారు.
Details
అంతరిక్ష అనుభవాలను శుభాంశు శుక్లా
భారత్ చేపడుతున్న అంతరిక్ష సంస్కరణలు, ఆశయాలు మరింత ముందుకు సాగేందుకు గగన్‌యాన్ కీలకంగా మారుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో అంతరిక్ష కార్యక్రమం ప్రధాన పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ భేటీ సందర్భంగా శుక్లా, తన అంతరిక్ష యాత్రలో తీసిన కొన్ని చిత్రాలను ట్యాబ్లెట్ ద్వారా ప్రధానికి చూపించి వాటి వివరాలను తెలియజేశారు. అలాగే అంతరిక్ష అనుభవాలు, శాస్త్ర-సాంకేతిక రంగ పురోగతి, గగన్‌యాన్ మిషన్ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
Details
వచ్చే ఏడాది అంతరిక్షంలోకి 'వ్యోమమిత్ర' రోబో
ఇదిలా ఉండగా 2040 నాటికి భారతీయ వ్యోమగామిని చంద్రుడిపైకి పంపే ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది అంతరిక్షంలోకి 'వ్యోమమిత్ర' రోబోను పంపనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. 2027లో తొలిసారి మానవ సహిత అంతరిక్ష యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే 2035 నాటికి భారత్‌కు సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పడనుందనీ, 2040లో చంద్రుడిపై భారతీయ వ్యోమగామి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారని స్పష్టం చేశారు.