500-kg of Crystal Meth: అరేబియా సముద్రంలో 500 కిలోల డ్రగ్స్ స్వాధీనం.. పోలీసుల అదుపులో పలువురు
సముద్ర గుండా గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్నఒక ముఠాను అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 500 కిలోల క్రిస్టల్ మెత్ (మాదక ద్రవ్యాలు) స్వాధీనం చేసుకున్నారు. భారత, శ్రీలంక నౌకాదళాల సంయుక్త ఆపరేషన్‌లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆపరేషన్‌లో రెండు పడవలను అదుపులోకి తీసుకుని, వారి నుంచి స్వాధీనం చేసిన మాదకద్రవ్యాలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం శ్రీలంక అధికారులకు అప్పగించారు. సమాచారం ప్రకారం, శ్రీలంక నేవీ నుంచి అందిన సమాచారంతో, భారత నావికాదళం సముద్రంలో ఆపరేషన్ చేపట్టింది. దీనిలో భాగంగా, రెండు పడవలు, వాటి సిబ్బందిని అదుపులోకి తీసుకొని, స్వాధీనం చేసిన డ్రగ్స్‌తో పాటు పూర్తి వివరాలు అందజేయడం జరిగింది.
మాదకద్రవ్యాలు అక్రమంగా సరఫరా
ఈ సంఘటన ద్వారా, భారతదేశం, శ్రీలంక నౌకాదళాల సంయుక్త సంకల్పాన్ని సూచిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం, ఈ మాదక ద్రవ్యాల విలువ,దాన్ని ఎక్కడకు తరలించేందుకు ప్రయత్నించారు అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. సముద్ర తీరం ప్రాంతాలలో గతకొంత కాలంగా మాదకద్రవ్యాలు అక్రమంగా సరఫరా అవుతున్నట్లు ఇటీవల అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడానికి అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నారు.