బీజేపీతో పొత్తుపై 2022లోనే ఎన్సీపీలో చర్చ; తిరుగుబాటు నేత ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు
అజిత్ పవార్ ఉదంతం తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ తిరుగుబాటు నేత, ఎంపీ ప్రఫుల్ పటేల్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బీజేపీతో చేతులు కలిపే అవకాశాలను పరిశీలించాలని 51మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు అధినేత శరద్ పవార్‌ను కోరినట్లు ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు. 2022లోనే బీజేపీలో చేరే ప్రక్రియ ప్రారంభమైందని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పటేల్ పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యేల సూచనలను అధిష్టానం పట్టించుకోలేదన్నారు. ఏక్ నాథ్ షిండే ఆ అవకాశాన్ని చేజిక్కించుకుని దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు వ్యాఖ్యానించారు.
జాతీయ ప్రయోజనాల కోసం బీజేపీతో చేతులు కలిపాం: పటేల్
ఎన్సీపీ నేతలు, కిందిస్థాయి కార్యకర్తలు కూడా ప్రభుత్వంలో చేరేందుకు ఉత్సాహం చూపించినట్లు పటేల్ పేర్కొన్నారు. అలాగే జాతీయ ప్రయోజనాల కోసం బీజేపీతో చేతులు కలిపినట్లు ప్రపుల్ పటేల్ చెప్పారు. శరద్ పవార్ తన విషయంలో బాధపడి ఉంటారని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఆయన తన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎదుర్కొంటానని చెప్పారు. అజిత్ పవార్‌తో పాటు అధికార కూటమిలో చేరిన మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ జయంత్ పాటిల్ అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంపై కూడా పటేల్ స్పందించారు. జయంత్ పాటిల్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడలేదని చెప్పారు. అతను తీసుకున్న నిర్ణయాలకు పవిత్రత లేదన్నారు.