
తెలంగాణలో ఎమ్మెల్యేలపై భారీగా క్రిమినల్ కేసులు.. 61శాతం మందికి నేరచరిత్ర
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని ప్రజాప్రతినిధులు 61 శాతం నేరచరితులని ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్) సర్వే తేల్చింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 44 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఎంత మంది శాసనసభ్యులు నేరచరిత్ర కలిగి ఉన్నారు, ఎవరెవరి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి అనే అంశంపై సర్వే నిర్వహించారు.
నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ)తో కలిసి ఏడీఆర్ సంయుక్తంగా సర్వే చేపట్టింది.
రాష్ట్రాలు, యూటీల్లో ఎన్నికల వేళ ఆయా అభ్యర్థులు అఫిడవిట్లు సమర్పించారు. వాటిని పరిశీలించి ఈ నివేదికను తయారు చేశారు.
తెలంగాణ
తెలంగాణలోని 118 మంది ఎమ్మెల్యేల్లో 72 మందిపై కేసులు
రాష్ట్రాల వారీగా సర్వే ఫలితాలు :
1. కేరళలోని 135 ఎమ్మెల్యేల్లో 95 మందిపై కేసులు ( 70శాతం )
2. బిహార్లోని 242 ఎమ్మెల్యేల్లో 161 మందిపై కేసులు (67శాతం)
3. దిల్లీలోని 70 మంది ఎమ్మెల్యేల్లో 44 మందిపై కేసులు (63శాతం)
4. మహారాష్ట్రలోని 284 మంది ఎమ్మెల్యేల్లో 175మందిపై కేసులు (62శాతం)
5. తెలంగాణలోని 118 మంది ఎమ్మెల్యేల్లో 72 మందిపై కేసులు (61శాతం)
6. తమిళనాడులోని 224 ఎమ్మెల్యేల్లో 134 మంది (60శాతం)పై క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం.
అయితే ఈ వివరాలను స్వయంగా ఎమ్మెల్యేలే ఎలక్షన్ అఫిడవిట్లలో వెల్లడించారు.
తెలంగాణ
అత్యంత తీవ్రమైన నేర కేసుల్లో అగ్రస్థానంలో దిల్లీ
భారతదేశంలోని 28 అసెంబ్లీలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభకు సంబంధించి దాదాపు 4,001 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలించామని ఏడీఆర్ ప్రకటించింది. దాని ఆధారంగానే నివేదిక వివరాలు వెల్లడిస్తున్నట్లు తెలిపింది.
అయితే అత్యంత తీవ్రమైన నేర కేసుల అంశంలో దిల్లీ తొలి స్థానంలో ఉంది.
దిల్లీలోని 53 శాతం మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. ఆయా రాష్ట్రాలు వరుసగా బిహార్ ( 50శాతం), మహారాష్ట్ర (40శాతం), ఝార్ఖండ్ (39శాతం), తెలంగాణ (39శాతం), యూపీ (38శాతం) మంది తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జాబితాలో ఉన్నారు.
మహిళలపై నేరాల విషయంలో 114 మంది శాసనసభ్యులు ఇలాంటి కేసుల్లో భాగంగా ఉన్నారు. వీరిలో 14 మందిపై అత్యాచారం కేసులు ఉండటం ఆందోళనకరమని సర్వే పేర్కొంది.