Page Loader
ఉత్తరాఖండ్‌, హిమాచల్‌‌లో వర్షాల బీభత్సం; 66కు చేరిన మృతుల సంఖ్య 
ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ వర్షాల బీభత్సం; 66కు చేరిన మృతుల సంఖ్య

ఉత్తరాఖండ్‌, హిమాచల్‌‌లో వర్షాల బీభత్సం; 66కు చేరిన మృతుల సంఖ్య 

వ్రాసిన వారు Stalin
Aug 16, 2023
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా ఇప్పటి వరకు 66మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. వరదలకు అనేక మంది గల్లంతయ్యారు. అలాగే వందల సంఖ్యలో గాయపడ్డారు. అనేక చోట్ల ఇళ్లు కూలిన కారణంగా మృతదేహాలను బయటకు తీయడానికి ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు 13 నుంచి హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరణాలు కూడా ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా 60మంది నమోదు కావడం గమనార్హం. కొండచరియలు విరిగిపడటంతో శిథిలాల కింద చిక్కుకున్న మూడు మృతదేహాలను మంగళవారం రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు.

వర్షాలు

ఉత్తరాఖండ్‌లో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

మరో రెండు రోజులు హిమాచల్ ప్రదేశ్‌, మరో నాలుగు రోజులు ఉత్తరాఖండ్‌లో కానీ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కార్యాలయం(ఐఎండీ) అంచనా వేసింది. అలాగే సిమ్లాలో తాజాగా కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మరణించారు. సిమ్లాలోని కృష్ణానగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. సిమ్లాలోని ఫాగ్లీ ప్రాంతంలో సోమవారం కొండచరియలు విరిగిపడటంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా హిమాచల్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు బుధవారం సెలవు ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లో మంగళవారం రెండు మృతదేహాలను వెలికితీయగా మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. మరో ఏడుగురు గల్లంతయ్యారు.