Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల బరిలో 7,994 మంది.. 921 మంది నామినేషన్లు తిరస్కరణ
నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తియైంది. మొత్తం 288 స్థానాలకు 7,994 మంది అభ్యర్థులు పోటీపడనున్నారు. వీటిలో 921 నామినేషన్లు తిరస్కరించామని ఎన్నికల అధికారులు ధ్రువీకరించారు. నామినేషన్ దాఖలు అక్టోబర్ 22న ప్రారంభమై 29న ముగియగా, అక్టోబర్ 30న పరిశీలన పూర్తయింది. అభ్యర్థిత్వాల ఉపసంహరణకు నవంబర్ 4 చివరి తేదీగా ఉంది. మహారాష్ట్రలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన మహాయుతి ప్రభుత్వం పునర్విజయంపై ఆశలు పెట్టుకున్నప్పుడు, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి విజయ లక్ష్యంతో ముమ్మరంగా పోరాటం చేస్తోంది.
ఓటు హక్కు పొందిన యువ ఓటర్లు 2శాతం మంది
ఇందులో కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ) పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. మహారాష్ట్రలో మొత్తం 9.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు, వారిలో మొదటిసారిగా ఓటు హక్కు పొందిన యువ ఓటర్లు కేవలం 2శాతం మాత్రమే ఉన్నారు. మొత్తం ఓటర్లలో 5 కోట్ల మంది పురుషులు, 4.6 కోట్ల మంది మహిళలు ఉండగా, 18-19 ఏళ్ల వయస్సులో ఉన్న తొలి ఓటర్లు 22.22 లక్షలు. 100 సంవత్సరాలు పైబడిన వృద్ధులు 21,089 మంది ఉన్నారని ఈసీ తెలిపింది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెల్లడవుతాయి, అలాగే 2019 ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య దాదాపు 72 లక్షల మంది పెరిగింది.