
Telangana: యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 70.13 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు.. పౌరసరఫరాల సంస్థ నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
యాసంగి (రబీ) సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 70.13 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల సంస్థ నిర్ణయించింది.
అందులో 23.42 లక్షల టన్నులు సన్నధాన్యం. నిజానికి రబీ సీజన్‌లో వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణలో అధికంగా దొడ్డు రకం ధాన్యమే సాగుచేస్తారు.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం సన్నరకాల సాగును ప్రోత్సహించడం, అలాగే వానాకాలం (ఖరీఫ్) పంటకు సంబంధించి రైతులకు క్వింటా ఒక్కింటికి రూ.500 చొప్పున సుమారు రూ.1200 కోట్ల బోనస్ అందించడంతో, ఆ ప్రభావం రబీ సాగుపైనా పడింది.
రాష్ట్రవ్యాప్తంగా 20.57 లక్షల ఎకరాల్లో రైతులు సన్నరకాలు సాగుచేయగా, 49.89 లక్షల టన్నుల సన్నధాన్యం దిగుబడి వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
సాగు ఎంత.. కొనుగోలు ఎంత?
అందులో 23.42 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు చేరుతాయని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, కొనుగోళ్ల కోసం కార్యాచరణ సిద్ధం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా రబీ సీజన్‌లో సన్నాలు, దొడ్డురకం కలిపి మొత్తం 54.89 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగైంది.
ఈ రెండు రకాలను కలిపి మొత్తం 137.10 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశముందని అంచనా. ఇందులో దొడ్డు రకం 46.71 లక్షల టన్నులు, సన్నధాన్యం 23.42 లక్షల టన్నులు కాగా, మొత్తం 70.13 లక్షల టన్నులను పౌర సరఫరాల సంస్థ సేకరించనుంది.