కేజీబీవీలో ఫుడ్ పాయిజన్.. ఆస్పత్రిలో చేరిన 70 మంది విద్యార్థినులు, నలుగురికి సీరియస్
తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని అమరచింత కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీలో) ఆహారం కలుషితమైన ఘటన కలకలం సృష్టించింది. ఎప్పటిలాగే విద్యార్థునులు రాత్రిపూట భోజనం చేశారు. గురువారం రాత్రి వీరికి వంకాయ, సాంబారు వడ్డించినట్లు తెలుస్తోంది. రాత్రి భోజనం అనంతరం 11 గంటల తర్వాత విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడుతూ విషయాన్ని ఒక్కొక్కరుగా సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి విద్యార్థినులు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి తీవ్రమైంది. అయితే సదరు విద్యాసంస్థలో కేవలం ఒక టీచర్, వాచ్‌మన్ మాత్రమే ఉన్నారు. దీంతో రాత్రి విద్యార్థినులను ఆస్పత్రికి పంపలేకపోయినట్లు తెలుస్తోంది. రాత్రంతా విద్యార్థునులంతా ఇబ్బందులు పడుతున్న క్రమంలో తెల్లవారుజామునే ఓ ప్రైవేట్ ఆటోలో బాధితులను ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యుల భరోసా
అనంతరం వైద్యులు,సిబ్బంది హుటాహుటిన చికిత్స ప్రారంభించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కానీ నలుగురు విద్యార్థులకు కడుపునొప్పి తగ్గకపోవడంతో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు వసతిగృహ సిబ్బంది ఆయా విద్యార్థునుల తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. దీంతో వారు హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. తమ పిల్లల పరిస్థితిని చూసి తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. అయితే విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తం 210 మంది విద్యార్థులు ఉన్నారు. అస్వస్థతకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.ఆహారం కలుషితం అయ్యిందా, లేక వేరే కారణాలున్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో 9,10, ఇంటర్ విద్యార్థినులే అధికంగా ఉండటం గమనార్హం.