తెలంగాణలో భారీగా పెరిగిన ఇంజినీరింగ్ సీట్లు.. 14,565 సీట్లకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో భారీ సంఖ్యలో ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కొత్తగా మరో 14 వేల 565 సీట్లు పెంచుకునేందుకు సర్కార్ పచ్చ జెండా ఊపింది. అయితే కోర్ గ్రూపులో సీట్లు ఎక్కువగా ఖాళీగా ఉంటున్న విషయాన్ని ఇంజినీరింగ్ కాలేజీలు గ్రహించాయి. ఈ మేరకు ఆయా సీట్లను ప్రభుత్వానికే వెనక్కి ఇచ్చేస్తామని విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లాయి. కోర్ సీట్ల స్థానంలో కంప్యూటర్, ఐటీ కోర్సులకు సంబంధించి సీట్లు పెంచాలని ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు కోరాయి . దీంతో 6 వేల 930 సీట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతే కాకుండా కొత్తగా మరో 7 వేల 635 ఇంజినీరింగ్ సీట్లకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది.
లక్ష దాటిన ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య
అదనపు సీట్ల వల్ల ఖజానాపై రూ. 27.39 కోట్ల భారాన్ని ప్రభుత్వం మోయనుంది. ఇటీవలే 86 వేల 106 ఇంజినీరింగ్ సీట్లకు అనుమతులు లభించాయి. తాజాగా సీట్లతో కలిపి తెలంగాణలో 1,00,671 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్టైంది. మరోవైపు ఇంజనీరింగ్ సీట్లు అన్ని బ్రాంచీలకు సంబంధించి పూర్తి స్థాయిలో నిండట్లేదు. కోర్ సబ్జెక్టులు ఈఈఈ, ఈసీఈ, మెకానికల్, ఆటోమొబైల్ తదితర కోర్సులకు డిమాండ్ క్రమంగా తగ్గిపోతోంది. ప్రస్తుతం ఐటీ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండటం, కార్పోరేట్ లైఫ్ కావాలని కోరుకునే విద్యార్థులు ఏటా పెరుగుతున్నారు. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ ఫోన్ తదితర వాటితో పని చేయాలని కోరుకునే వారు పెరుగుతుండటమే కారణం.