Page Loader
Syria: సిరియాలో ఉద్రిక్తతలు.. 75 మంది భారతీయులు తరలింపు.. విదేశాంగ శాఖ ఏం చెప్పిందంటే.. 
సిరియాలో ఉద్రిక్తతలు.. 75 మంది భారతీయులు తరలింపు..

Syria: సిరియాలో ఉద్రిక్తతలు.. 75 మంది భారతీయులు తరలింపు.. విదేశాంగ శాఖ ఏం చెప్పిందంటే.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2024
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

సిరియాలో తిరుగుబాటు దళాలు దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో అధ్యక్షుడు బషర్ అల్-అసద్ సిరియాను విడిచి వెళ్లిపోయారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులను సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ చర్యలు తీసుకుంటోంది. తాజాగా, 75 మంది భారత పౌరులను సిరియా రాజధాని డమాస్కస్‌ నుంచి లెబనాన్‌కు సురక్షితంగా తరలించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. వీరిలో 44 మంది జమ్ముకశ్మీర్‌కు చెందిన యాత్రికులు ఉన్నారని, వారు వాణిజ్య విమానాల ద్వారా త్వరలోనే స్వదేశానికి చేరుకోనున్నారని మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇంకా అనేక మంది భారతీయులు సిరియాలోనే ఉన్నారని పేర్కొంటూ, వారు డమాస్కస్‌లోని రాయబార కార్యాలయంతో లేదా +963 993385973 వాట్సప్‌లో, hoc.damascus@mea.gov.in ఇ-మెయిల్‌ ద్వారా టచ్‌లో ఉండాలని సూచించింది.

వివరాలు 

కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు

తిరుగుబాటు దళాలు రాజధాని డమాస్కస్‌తో పాటు పలు నగరాలను ఆక్రమించడంతో అసద్ తన కుటుంబంతో కలిసి రష్యాకు శరణార్థిగా వెళ్లిపోయారని, ప్రస్తుతం మాస్కోలో ఉన్నారని రష్యా ప్రభుత్వం తెలిపింది. అధికార బదిలీపై తిరుగుబాటు దళాలతో చర్చలు జరిపిన తరువాతే అసద్ సిరియాను విడిచారని రష్యా పేర్కొంది. అసద్ వెళ్లిన వెంటనే రెబల్స్ నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన ఆనందంతో సంబరాలు నిర్వహించారని, ప్రస్తుతం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.