Delhi Services Bill: నేడు లోక్‌సభలో దిల్లీ సర్వీస్ బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
దిల్లీ సర్వీసెస్ బిల్లు (గవర్నమెంట్ ఆఫ్ ది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ దిల్లీ (సవరణ) బిల్లు, 2023)ను మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. తొలుత ఈ బిల్లును లోక్‌సభలో ప్రతిపాదించనున్నారు. దిల్లీలో గ్రూప్-ఎ అధికారుల బదిలీ, పోస్టింగ్ అథారిటీ ఏర్పాటు కోసం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం ఈ సవరణ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టబోతోంది. లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి మంగళవారం ఈ బిల్లును సభ వ్యవహారాల జాబితాలో చేర్చారు. హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ దిల్లీ సర్వీసెస్ బిల్లును తక్షణమే చట్టం ఎందుకు చేయాలనే దానిపై వివరిస్తారు. అనంతరం లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందనుంది.
ఉభయ సభల్లో దిల్లీ సర్వీస్ బిల్లు ఆమోదం లాంచనమే
వాస్తవానికి ఈ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టాలని భావించారు. అయితే, మణిపూర్ అంశంపై సభకు అంతరాయం ఏర్పడడంతో బిల్లు ప్రవేశపెట్టలేకపోయారు. ఉభయ సభల్లో ఈ బిల్లు ఆమోదం పొందితే, ప్రస్తుత ఆర్డినెన్స్ స్థానంలో దిల్లీ ఢిల్లీ సర్వీసెస్ బిల్లు చట్టంగా అమల్లోకి వస్తుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే, దిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇచ్చిన అధికారులు చెల్లకుండాపోతాయి. ఇదిలా ఉంటే, కేంద్రం తీసుకొస్తున్న కొత్త బిల్లుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం గట్టాగానే పోరాడారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ అంశంపై ప్రతిపక్షాలను కలిసి, మద్దతును కూడా పొందారు. అయితే ఉభయ సభల్లో బీజేపీకి మెజార్టీ ఉండటంతో ఈ దిల్లీ సర్వీస్ బిల్లు చట్టంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.