ఇండిగో విమానాన్ని ఢీకొన్న పక్షి.. భువనేశ్వర్‌లో అత్యవసరంగా ల్యాండింగ్
భువనేశ్వర్ నుంచి దిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం గాల్లో ఉండగా పక్షి ఢీకొనడంతో అత్యవర ల్యాండింగ్ చేశారు. టేకాఫ్ అయిన కాసేపటికే పక్షి ఢీకొనడంతో ఆ విమానాన్ని భువనేశ్వర్ విమానాశ్రయంలో అత్యవసరంగా సురక్షితంగా ల్యాండింగ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇండిగో విమానం 6E 2065 ఉదయం 7.50 గంటలకు భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి దిల్లీకి బయలుదేరింది. 25 నిమిషాల తర్వాత దాని ఎడమ ఇంజిన్‌లో 'సాంకేతిక సమస్య' ఏర్పడిందని, భువనేశ్వర్‌కు తిరిగి వెళ్లాలని పైలట్ నిర్ణయించుకున్నట్లు విమానాశ్రయవర్గాలు తెలిపాయి. డీజీసీఏ నుంచి అవసరమైన అనుమతి పొందిన తర్వాత విమానం బయలుదేరుతుందని బీపీఐఏ డైరెక్టర్ వెల్లడించారు. అయితే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమాన ప్రయాణాలను ఇండిగో ఎయిర్ లైన్స్ సమకూర్చింది.