Supreme court: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బ.. మోడీ డిగ్రీ కేసులో కీలక పరిణామం
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ప్రధానమంత్రి మోదీ డిగ్రీ సర్టిఫికెట్లపై చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ యూనివర్సిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆయన కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సోమవారం న్యాయస్థానం కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో కేజ్రీవాల్‌పై విచారణ కొనసాగనుంది. గుజరాత్ యూనివర్సిటీ, కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల వల్ల పరువు నష్టం జరిగిందంటూ కేసు నమోదు చేయడంతో, ఆయనపై సమన్లు జారీ చేశారు. ఈ సమన్లపై హైకోర్టులో పిటిషన్ వేయగా, అక్కడ కూడా కేజ్రీవాల్‌కు నిరాశే ఎదురైంది.
కేజ్రీవాల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ, సుప్రీం కూడా పిటిషన్‌ను కొట్టివేసింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. మోడీ డిగ్రీని బయటపెట్టకపోవడంపై ప్రశ్నలు రేకెత్తించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు అవమానకరమని భావిస్తే, నరేంద్ర మోదీ స్వయంగా పరువు నష్టం దావా వేయాల్సిందని, యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు ఆ హక్కు లేదని సింఘ్వీ వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు మాత్రం, గతంలో ఇదే అంశంపై ఆప్ నేత సంజయ్ సింగ్ వేసిన పిటిషన్‌ను ఏప్రిల్ 2024లో కొట్టివేసిన తీర్పును ప్రస్తావించింది. అదే తీర్పును స్ఫూర్తిగా తీసుకుని, కేజ్రీవాల్ పిటిషన్‌ను కూడా కొట్టివేసింది.