
Pulasa Fish Price: యానాంలో పులసల సందడి.. రుచికర చేపకు రికార్డు రేటు!
ఈ వార్తాకథనం ఏంటి
గోదావరి నదిలో వరదలు పెరుగుతున్న నేపథ్యంలో యానాంలో పులస చేపల హడావుడి మళ్లీ మొదలైంది. ఈ సందర్భంగా పులసల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా యానాం ఫిష్ మార్కెట్‌లో పులస చేప కిలో రూ.22 వేల వరకు ధర పలకడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇది ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధర కావడం గమనార్హం. ఈ చేపను ఓ మత్స్యకార మహిళ వేలంలో కొనుగోలు చేయగా, ఆమె దాన్ని మరింత లాభంతో విక్రయించాలని భావిస్తున్నారు. ఈ సీజన్ ఆరంభంలో మొదటి పులస రూ.4000కి అమ్ముడైంది. ఆ తర్వాత అదే రోజు మరో చేప రూ.15 వేల ధరను అందుకుంది.
Details
రూ.22వేలకు సొంతం చేసుకున్న వ్యాపారీ
గత వారం వచ్చిన రెండు పులసలు వరుసగా రూ.13 వేలు, రూ.18 వేల ధరలకు విక్రయమైనా.. తాజాగా నమోదైన రూ.22 వేల ధర రికార్డుగా నిలిచింది. ప్రస్తుతం గోదావరి నదిలో ఎర్ర నీటి ప్రవాహం భారీగా ఉండటంతో పులస చేపలు భారీగా చేరుతున్నాయి. వరదల వేగానికి ఎదురీదుతూ వచ్చే పులసల వేటలో మత్స్యకారులకు సీజనల్ గుడ్‌న్యూస్ లభించింది. వేట సాగుతున్న కొద్దీ మార్కెట్‌లో పోటీ కూడా పెరుగుతోంది. పులస చేపలు తమ విలక్షణ రుచి, అరుదైన లభ్యత వల్లే ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి. అందుకే పుస్తెలు అమ్మినా సరే, పులస తినాలి అన్న నానుడి మరింత సమకాలీనమై కనిపిస్తోంది. వచ్చే రోజుల్లో పులస ధర మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.