చిన్నారి వైద్యం కోసం పేరు చెప్పకుండా రూ.11కోట్లు విరాళంగా ఇచ్చిన దాత
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి చికిత్స నిమిత్తం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.11కోట్లను విరాళంగా ఇచ్చాడు. అంత మొత్తం ఇచ్చిన వ్యక్తి అతని పేరు చెప్పకపోవడం గమనార్హం. కేరళకు చెందిన సారంగ్ మీనన్, అదితి దంపతులు ముంబయిలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతుల 15నెలల కుమారుడు నిర్వాన్ అరుదైన జన్యు నాడీ కండరాల ఎస్ఎంఏ టైప్-2 వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి క్రమంగా కదలికను కోల్పోయేలా చేస్తుంది. చికిత్స చేయకపోతే చనిపోయే అవకాశం ఉంటుంది. జనవరి 7న అతనికి వ్యాధి నిర్ధారణ కాగా, జీన్ రీప్లేస్‌మెంట్ థెరపీకి అవసరమైన మందు ఖరీదు ఒక డోస్ ధర దాదాపు రూ. 17.5కోట్లు ఉంటుందని డాక్టర్లు చెప్పారు.
అతను ఎవరైనా మాకు దేవుడితో సమానం: చిన్నారి తండ్రి
డాక్టర్లు చెప్పిన రూ. 17.5 కోట్లను సేకరించడానికి సారంగ్ మీనన్, అదితి దంపతులు రెండు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన మిలాప్, ఇంపాక్ట్‌గురులో ఖాతాలను తెరిచారు. ఫిబ్రవరి 19 నాటికి తమ మిలాప్ ఖాతాలో రూ. 5.5 కోట్ల విరాళాలు వచ్చాయని, ఫిబ్రవరి 20న ఒక్కసారిగా రూ.11కోట్లు వచ్చి చేరాయని సారంగ్ చెప్పారు. ఇది నిజమా, సాంకేతిక లోపమా అని మిలాప్ ఆపరేటర్‌తో చెక్ చేయించగా వాస్తవమే అని తేలిందని సారంగ్ పేర్కొన్నారు. అతను ఎవరైనా తమకు దేవుడితో సమానమని, మానవత్వం ఇంకా సజీవంగానే ఉందని నిరూపించారని భావోద్వేగంగా చెప్పారు సారంగ్.