Gyanvapi Case: జ్ఞానవాపి మసీదుకి ముందు అక్కడ పెద్ద హిందూ దేవాలయం ఉండేది..ఏఎస్‌ఐ సంచలన నివేదిక
ఉత్తర్‌ప్రదేశ్ లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయంలో పెద్ద హిందూ దేవాలయ నిర్మాణం ఉన్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)ఇటీవలి నివేదిక సూచిస్తోందని హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ గురువారం పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో జైన్ మాట్లాడుతూ,మసీదు నిర్మించేందుకు ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు నివేదిక సూచిస్తోందని అన్నారు. మసీదులో లోపల కనుగొన్న వస్తువులన్నీ డాక్యుమెంట్ చేయబడ్డాయని, నిర్మాణానికి ఎటువంటి నష్టం జరగలేదన్నారు. శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా,ఇప్పటికే ఉన్న నిర్మాణంలో గతంలో ఉన్న నిర్మాణానికి సంబంధించిన స్తంభాలను ఉపయోగించారని,ముందుగా ఉన్న నిర్మాణం అక్కడే ఉందని ఆయన విలేకరులతో అన్నారు. దేవనాగరి, తెలుగు, కన్నడ , ఇతర లిపిలలో వ్రాయబడిన పురాతన హిందూ దేవాలయానికి చెందిన శాసనాలు కనుగొనబడినట్లు జైన్ పేర్కొన్నారు.
ఏఎస్‌ఐ సర్వే నివేదికను తప్పనిసరిగా హిందూ,ముస్లిం పక్షాలకు ఇవ్వాలి: వారణాసి కోర్టు
సర్వే సమయంలో,ఇప్పటికే ఉన్న నిర్మాణంపై అనేక శాసనాలు గుర్తించబడ్డాయి. ప్రస్తుత సర్వేలో మొత్తం 34 శాసనాలు నమోదు చేయబడ్డాయి,32 స్టాంప్డ్ పేజీలు తీయబడ్డాయి,"అని జైన్ నివేదికను చదువుతూ చెప్పారు. కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞాన్‌వాపి మసీదు సముదాయానికి సంబంధించిన ఏఎస్‌ఐ సర్వే నివేదికను తప్పనిసరిగా హిందూ, ముస్లిం పక్షాలకు ఇవ్వాలని వారణాసి కోర్టు తీర్పు ఇచ్చిన ఒక రోజు తర్వాత ఈ విషయాలు వెల్లడయ్యాయి. మసీదు హిందూ దేవాలయం పూర్వ నిర్మాణంపై నిర్మించబడిందో లేదో నిర్ధారించడానికి గత సంవత్సరం, ASI జ్ఞానవాపి ప్రాంగణంలో ఒక శాస్త్రీయ సర్వేను నిర్వహించింది. హిందూ పిటిషనర్లు 17వ శతాబ్దానికి చెందిన మసీదును ముందుగా ఉన్న దేవాలయంపై నిర్మించారని పేర్కొనడంతో ASI సర్వేను కోర్టు ఆదేశించింది.