
Smart agriculture: మన పంటలకు నూతన శకం.. స్మార్ట్ వ్యవసాయం వచ్చేస్తోంది!
ఈ వార్తాకథనం ఏంటి
పోలంలో నేల నాణ్యత, పంట ఎదుగుదల, చీడపీడల ఉనికిని ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్వయంచాలకంగా స్కాన్ చేస్తుంది. ఏ పురుగు మందులను, ఎరువులను ఎక్కడ, ఏ పరిమాణంలో పిచికారీ చేయాలో కూడా ఏఐ సూచిస్తుంది. కలుపు మొక్కలను మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) గుర్తిస్తే, ఆకుల పరిమాణం, ఆకారం, రంగును కంప్యూటర్ విజన్ విశ్లేషిస్తుంది. రోబోట్లు వచ్చి కలుపును తొలగిస్తాయి. తదుపరి, పంటలకు కావాల్సిన నీటిని ఎప్పుడు, ఎంత అందించాలో ఐఓటీ (IoT) సెన్సర్లు పర్యవేక్షిస్తాయి. పంట చివరి దశ చేరినప్పుడు ఏఐ రోబోలకు సంకేతం ఇస్తుంది. డిజిటల్ ఆటోమేషన్ ద్వారా కోత పూర్తవుతుంది. చివరగా, దిగుబడుల ఆకారం, రంగు, పరిమాణం ఆధారంగా రోబోట్లు వాటిని గ్రేడ్ చేసి, మార్కెటింగ్ అవకాశాలను సూచిస్తాయి.
Details
దేశంలో తొలిసారిగా అధునాతన ప్రయోగశాల
ఇవి అన్నీ ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, జర్మనీ వంటి దేశాల ఆధునిక వ్యవసాయంలో కనబడుతున్నా, భారత్ స్వాతంత్య్రానికి 100 ఏళ్లు పూర్తయే 2047 నాటికి తెలంగాణలోనూ మానవరహిత వ్యవసాయాన్ని సాకారం చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో దేశంలోనే తొలిసారిగా అధునాతన ప్రయోగశాల (Advanced Lab) ఏర్పాటు చేయనున్నారు. ఎస్‌బీఐ రూ.15 కోట్లు సమకూరుస్తుండగా, ఈ ప్రయోగశాలకే "ఎస్‌బీఐ ఏఐ, రోబోటిక్స్, ఐఓటీ ఫండెడ్ స్మార్ట్ అగ్రికల్చర్ ల్యాబ్ (SBI ARISA) అని నామకరణం చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని డిజిటల్ వ్యవసాయ కేంద్రంలో ఒక ఎకరం స్థలంలో నిర్మించబడుతున్న ఈ ప్రయోగశాల మరిన్ని మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది.
Details
పరిశీలన నుంచి పరిశోధనల వరకు
రైతులు, విద్యార్థులు, పరిశోధకులు, ఆవిష్కర్తల నైపుణ్య అభివృద్ధికి ఈ కేంద్రం సేవలందిస్తుంది. ఏఐ, డ్రోన్, రోబోటిక్స్, మెకాట్రానిక్స్ వంటి రంగాలపై అధునాతన ప్రయోగశాలలు, లైవ్ డెమో కేంద్రం, ఆటోమేటెడ్ ఫార్మ్ మెషినరీ తయారీ-విస్తరణ కేంద్రం, డ్రోన్ అకాడమీ, అగ్రి ఫోటో వోల్టాయిక్, స్మార్ట్ అగ్రికల్చర్, యంత్ర సాగు కేంద్రం వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచనున్నారు. డిజిటల్ వ్యవసాయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ఎం.ఎస్‌సీ, ఎం.టెక్ విద్యార్థులకు పరిశోధనావకాశాలు, గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ, రైతులకు అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. ఇందుకోసం ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, బిట్స్ పిలానీతోపాటు అగ్రివర్శిటీలోని అగ్రిహబ్ ఇంక్యుబేషన్ కేంద్రంలో ఉన్న అంకుర సంస్థల సహకారాన్ని తీసుకోనున్నారు.
Details
డిజిటల్ వ్యవసాయ రాష్ట్రమే లక్ష్యం
తెరాసే డిజిటల్ వ్యవసాయ రాష్ట్రాన్ని నిర్మించడం లక్ష్యమని వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి అల్దాస్ జానయ్య తెలిపారు. తెలంగాణ రైతులకు ఉన్నత సాంకేతికత అందించడం లక్ష్యంగా ఈ ప్రయోగశాల కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ''మా ఆలోచన తెలిసిన వెంటనే వ్యవసాయ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి, ఎస్‌బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ముందుకు వచ్చి, ఎస్‌బీఐ ఫౌండేషన్ తరఫున రూ.15 కోట్లు అందజేశారు. ఇప్పటికే రూ.2.50 కోట్లతో పనులను ప్రారంభించాము. ఈ ప్రయోగశాల అగ్రిహబ్ పర్యవేక్షణలో పనిచేస్తుంది. వ్యవసాయంలో కూలీల కొరత సమస్యను పరిష్కరించడం దీని ప్రధాన లక్ష్యమని అల్దాస్ జానయ్య తెలిపారు.