
Telangana: రఘునాథపాలెం చరిత్రలో సరికొత్త శకం.. 100 రోజుల్లోనే 'ఎత్తిపోతల' ఫలాలు
ఈ వార్తాకథనం ఏంటి
కృష్ణమ్మ పారుతున్నా.. చుక్క నీరందక ఎండిపోయిన నేలలవి.సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో, ఇక్కడి రైతులు వర్షాలపై, బోర్లు, బావులపైనే ఆధారపడేవారు.
అయితే ఇప్పుడిప్పుడే ఈ మండల చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
రఘునాథపాలెంలోని పంటపొలాలను సస్యశ్యామలంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంచుకొండ ఎత్తిపోతల పథకం ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది.
ఈ కారణంగా రైతుల ముఖాల్లో ఆనందపు చిరునవ్వులు కనబడుతున్నాయి.
వివరాలు
రూ.66.33 కోట్లతో భవిష్యత్తు మారుస్తున్న ప్రాజెక్టు
ఈ పథకానికి మొత్తం రూ.66.33 కోట్లు ఖర్చు పెట్టి, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని 37 చెరువులను నింపి, దాదాపు 4,000 ఎకరాల ఆయకట్ట భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు.
పథకాన్ని వి.వెంకటాయపాలెం వద్ద ఉన్న సాగర్ కాల్వ డీప్ కట్ దగ్గర ఏర్పాటు చేశారు.
ఇక్కడ 450 కిలోవాట్ల సామర్థ్యం గల మూడు మోటార్లను అమర్చారు.
ఒక్కో మోటార్ ద్వారా 20 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉంది.
నీటిని పైకి ఎత్తి, మంచుకొండ వద్ద గుట్టపై ఏర్పాటు చేసిన అవుట్‌లెట్ ద్వారా నాలుగు వైపులా తవ్విన పంటకాల్వల ద్వారా చెరువులకు తరలించే విధంగా వ్యవస్థను రూపొందించారు.
వివరాలు
భోగికి శంకుస్థాపన, 100 రోజుల్లో పైపులైన్ పూర్తీ
ఈ ఏడాది జనవరి 13న భోగి పండగ సందర్భంగా, ఈ పథకానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదిరింది.
అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించి, అందులో 9 కిలోమీటర్ల ప్రధాన పైపులైన్‌ను కేవలం 100 రోజుల్లోనే పూర్తి చేయాలని అధికారులను గట్టి ఒత్తిడిలో పెట్టారు.
ప్రస్తుతం ప్రధాన పైపులైన్ పూర్తవగా, మొత్తం 25 కిలోమీటర్ల లింకు పైపులైన్లలో సగభాగం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
వివరాలు
ఒక మోటార్‌తో ట్రయల్ రన్ విజయవంతం
ఈ పైపులు రైతుల పొలాల్లో యంత్రాలతో వేసే పరిస్థితి ఏర్పడింది. ప్రారంభంలో రైతులు తమ భూములపై అభ్యంతరం చెప్పగా, మంత్రి తుమ్మల పొలాల్లోకి వెళ్లి వారి అభిప్రాయాలు స్వయంగా తెలుసుకొని ఒప్పించారు.
భూములకు ఎటువంటి పరిహారం చెల్లించకుండా 2 మీటర్ల లోతులో పైపులు వేసారు.
మొత్తం మూడు మోటార్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా, అవసరమైన మోటార్లు సకాలంలో రాకపోవడంతో పాలమూరు-రంగారెడ్డి పథకానికి తెప్పించిన ఒక మోటార్‌ను తాత్కాలికంగా తీసుకొచ్చి అమర్చారు.
అదే మోటార్‌తో ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే పూర్తి పనులను ముగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
తద్వారా ఈ వానాకాలం నుంచే పంటలకు తగిన సాగునీరు అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.