
Andhra Pradesh: ఏపీ యువత ప్రతిభకు వేదిక.. ఆంధ్ర యువ సంకల్ప్ 2కె25 డిజిటల్ మారథాన్
ఈ వార్తాకథనం ఏంటి
మీరు యువతలో సామాజిక అవగాహన కలిగించే వీడియోలు రూపొందించగలరా? కుటుంబ విలువలు, సంబంధాల బంధాలను వివరించగలరా? ఆరోగ్యంపై దృష్టి పెట్టేలా ఫిట్‌నెస్ ప్రాధాన్యం చెప్పగలరా? కొత్త సాంకేతిక పరిణామాలు, ముఖ్యంగా ఏఐ (AI) మార్పులకు ప్రజలను సన్నద్ధం చేయగలరా? అయితే మీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది 'ఆంధ్ర యువ సంకల్ప్ 2కె25'. యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ డిజిటల్ మారథాన్, 'వికసిత్ భారత్ 2047', 'స్వర్ణాంధ్ర విజన్ 2047' లక్ష్యాల్లో యువతను భాగస్వామ్యం చేయడమే ఉద్దేశ్యం.
వివరాలు
ఏం చేయాలి?
ఈ కార్యక్రమంలో మూడు విభాగాలు (థీమ్‌లు) ఉన్నాయి: 'యూత్ రెస్పాన్స్‌బిలిటీస్'.. ఇందులో సామాజిక బాధ్యతలు, కుటుంబ బంధాలు, మానవీయ విలువలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. 'ఫిట్ యూత్ ఏపీ'.. ఇందులో ఫిట్‌నెస్, జీవనశైలి, క్రీడలు, పోషకాహారం, శారీరక-మానసిక ఆరోగ్యం వంటి విషయాలు ఉంటాయి. 'స్మార్ట్ యూత్ ఏపీ'.. ఇందులో ఏఐ సహా సాంకేతిక మార్పులు, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలు, సమాజంలో ఉన్న అపోహల నివారణపై కంటెంట్ చేయాలి. ఈ విభాగాలపై ప్రేరణాత్మక వీడియోలు లేదా షార్ట్స్ రూపొందించి, #ఆంధ్రయువసంకల్ప్2కె25 హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో పోస్టు చేయాలి.
వివరాలు
ఎవరు పాల్గొనవచ్చు?
ఈ కార్యక్రమం ఈ నెల 1 నుండి 30 వరకు కొనసాగుతుంది. పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థులు, యువ ఉద్యోగులు, డిజిటల్ క్రియేటర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఫిట్‌నెస్ ట్రైనర్స్ వంటి ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. ఒకరు మూడు విభాగాల్లోనూ వీడియోలు చేయవచ్చు. కావాలంటే అనేక వీడియోలు కూడా రూపొందించవచ్చు.
వివరాలు
ఎంపిక ఎలా జరుగుతుంది?
సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియోల లింక్‌ను www.andhrayuvasankalp.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి, మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. అందిన వాటిలో ప్రజాదరణ పొందినవి, స్ఫూర్తిదాయకమైనవి, వినూత్నమైనవి ఎంపిక చేస్తారు. ప్రతి విభాగంలో మూడు బహుమతులు ఉంటాయి: ప్రథమ బహుమతి - రూ.1,00,000 ద్వితీయ బహుమతి - రూ.75,000 తృతీయ బహుమతి - రూ.50,000 అంటే మొత్తం తొమ్మిది మంది విజేతలను 'ఆంధ్ర యూత్ బ్రాండ్ అంబాసిడర్-2కె25'గా ప్రకటిస్తారు. ప్రత్యేక గుర్తింపు మారథాన్‌లో పాల్గొన్న వారందరికీ 'డిజిటల్ క్రియేటర్ ఆఫ్ ఏపీ 2కె25' అనే గుర్తింపు ఇస్తారు. అదనంగా, యువజన సేవల శాఖ నుంచి ధ్రువపత్రం కూడా అందజేస్తారు.