
Delhi: ఏపీకి అరుదైన గౌరవం.. ఐదు నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు!
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలు ఈ అవార్డులను సాధించాయి. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరాలు వివిధ కేటగిరీల్లో అవార్డులను పొందాయి. జాతీయ స్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డుకు విశాఖపట్నం ఎంపికవ్వగా, రాష్ట్ర స్థాయిలో ఇదే కేటగిరీలో రాజమహేంద్రవరం అవార్డు పొందింది. అలాగే స్వచ్ఛ సూపర్‌లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు ఎంపికయ్యాయి. ఈ విజయాలతో ఆ నగరాల పరిపాలన సమర్థత, పారిశుద్ధ్యంపై తీసుకున్న చర్యలకు గుర్తింపు లభించింది.
Details
స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల ఫలితంగానే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులు
ఈ సందర్భంగా ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ స్పందిస్తూ.. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో అమలు చేసిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల ఫలితంగానే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులు లభించాయని అన్నారు. అవార్డుల సాధనలో కృషి చేసిన అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, సహకరించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పరిశుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన పెరిగేందుకు, నగరాల్లో శుభ్రత మెరుగయ్యేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలిస్తున్నట్లు ఈ అవార్డులు సూచిస్తున్నాయి.