Yadadri temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి హుండీకి కాసుల వర్షం.. రికార్డు స్థాయిల,ఎన్ని కోట్లంటే!
తెలంగాణ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో హుండీ ఆదాయం కూడా పెరిగింది. ఆలయ హుండీ ద్వారా 28 రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.3.15 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. 28 సాధారణ రోజుల్లో ఆలయ ఖజానాకు హుండీ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఆలయ చరిత్రలో సరికొత్త రికార్డు. సాధారణ రోజుల్లో 10,000 నుండి 20,000 మంది, సెలవు రోజుల్లో 60,000 నుండి 70,000 మంది ఆలయాన్ని సందర్శిస్తారు.
రికార్డు స్థాయిలో రూ.3.15 కోట్ల ఆదాయం
గత 28 సాధారణ రోజుల్లో ఆలయ హుండీల ద్వారా రికార్డు స్థాయిలో రూ.3.15 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఈ మేరకు కొండ కింద ఉన్న ఆధ్యాత్మిక గ్రామంలోని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో భక్తులు సమర్పించిన నగదు,నగలను లెక్కించారు. ఆభరణాల రూపంలో రూ.3,15,05,035 నగదు,100 గ్రాముల బంగారం,4,250 గ్రాముల వెండి ఆదాయం క్రింద వచ్చినట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు. అమెరికా,ఆస్ట్రేలియా,కెనడా,సింగపూర్,యూఏఈ,బ్రిటన్, సౌదీ అరేబియా, ఒమన్, మలేషియా, నేపాల్, ఖతార్, థాయిలాండ్, న్యూజిలాండ్ దేశాల నగదు (కరెన్సీ) కూడా హుండీల ద్వారా అందింది. నగదు ఆదాయం రూ.2.5 కోట్లు కాగా ఈసారి రూ.3.15 కోట్లు వచ్చిందని ఈఓ తెలిపారు. ఆలయ చరిత్రలో ఇది సరికొత్త రికార్డు అని అధికారులు చెబుతున్నారు.