Loading...
Heeraben Modi Temple: ఏపీలో మోదీ తల్లి హీరాబెన్‌కు ఆలయం.. కర్నూలు జిల్లాలో భూమిపూజ
ఏపీలో మోదీ తల్లి హీరాబెన్‌కు ఆలయం.. కర్నూలు జిల్లాలో భూమిపూజ

Heeraben Modi Temple: ఏపీలో మోదీ తల్లి హీరాబెన్‌కు ఆలయం.. కర్నూలు జిల్లాలో భూమిపూజ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2026
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి, దివంగత హీరాబెన్‌కు ఆంధ్రప్రదేశ్‌లో ఆలయం నిర్మించనున్నారు. తల్లిపై కుమారుడికి ఉండే భక్తి, గౌరవానికి ప్రతీకగా కర్నూలు జిల్లాలో ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మిగనూరు మండలం గుడికల్లు గ్రామంలో అర ఎకరం స్థలంలో మాత శ్రీ మందిరం ఛారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

వివరాలు

పార్టీలకు అతీతంగా హాజరైన నేతలు

ఈ భూమిపూజ కార్యక్రమానికి ఆదోని నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పి.వి. పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలతో పాటు జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు స్థానిక రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.

పార్టీలకు అతీతంగా నాయకులు హాజరుకావడం విశేషంగా నిలిచింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పి.వి. పార్థసారథి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తల్లికి ఆలయం నిర్మించడం దేశంలోనే ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి దేశానికి పెద్దదిక్కు అని, అలాంటి గొప్ప నాయకుడికి జన్మనిచ్చిన మాతృమూర్తికి ఆలయం నిర్మించడం దేశంలోని సమస్త తల్లులకు ఇచ్చే అత్యున్నత గౌరవంగా భావించాలని అభిప్రాయపడ్డారు.

వివరాలు

రూ.3 లక్షలతో పాలరాతి విగ్రహం

ఆలయ నిర్మాణ వివరాలను మాత శ్రీ మందిరం ఛారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు శివకుమార్ మీడియాకు వెల్లడించారు.

దాతల నుంచి విరాళాలు సేకరించి మందిరాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. హీరాబెన్ మోదీకి నివాళిగా సుమారు రూ.3 లక్షల వ్యయంతో ప్రత్యేకంగా పాలరాతి విగ్రహాన్ని తయారు చేయించినట్లు చెప్పారు.

విగ్రహ ప్రతిష్ఠాపనకు సిద్ధంగా ఉందని వివరించారు. ఈ ఆలయ సముదాయంలో హీరాబెన్ మోదీ మందిరంతో పాటు పరమశివుడు, దక్షిణామూర్తి, శ్రీరాముడు, మహాగణపతి ఆలయాలను కూడా నిర్మించనున్నట్లు శివకుమార్ తెలిపారు.

దాతల ఉదార విరాళాలతో రాబోయే రెండు నెలల్లోనే నిర్మాణ పనులు పూర్తి చేసి, విగ్రహ ప్రతిష్ఠాపన చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు

అనాథాశ్రమం, గోశాల ఏర్పాటు

ఆలయ నిర్మాణంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఛారిటబుల్ సొసైటీ నిర్ణయించింది.

ఆలయ ప్రాంగణంలో అనాథ పిల్లల సంరక్షణ కోసం అనాథాశ్రమం, గోవుల సంరక్షణ కోసం గోశాల ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు శివకుమార్ వెల్లడించారు.

తల్లి ప్రేమకు నిదర్శనంగా నిర్మితమవుతున్న ఈ ఆలయం ప్రస్తుతం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ADVERTISEMENT