Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. మంచు చరియల కింద చిక్కుకున్న 8 మంది
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్‌లో ఇటీవల విస్తృతంగా మంచు కురుస్తుండటంతో భారీగా మంచు చరియలు విరిగిపడిన ఘటన చోటుచేసుకుంది.
ఈ దుర్ఘటనలో సహాయక పనుల్లో ఉన్న కార్మికుల్లో 55 మంది చిక్కుకుపోయారు. ఇప్పటివరకు 33 మందిని రక్షించగా, తాజాగా భారత ఆర్మీ మరో 14 మందిని సురక్షితంగా బయటకు తీశింది.
అయితే ఇంకా 8 మంది మంచులోనే చిక్కుకుపోయి ఉన్నారు. ఆర్మీ బృందాలు వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఈ ఘటన బద్రీనాథ్‌కు సమీపంలోని ఛమోలీ జిల్లా మనా గ్రామంలో శుక్రవారం జరిగింది. మనా గ్రామం భారత్-టిబెట్ సరిహద్దులో ఉన్న దేశానికి చివరి గ్రామం.
జాతీయ రహదారిపై పేరుకుపోయిన మంచును తొలగించే క్రమంలో బ్రిడ్జెస్ అండ్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) సిబ్బందిపై అకస్మాత్తుగా మంచు చరియ విరిగిపడింది.
Details
సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం
ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉండటం, మంచుతో కూడిన వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
ప్రస్తుతం రక్షించిన 14 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హెలికాప్టర్ ద్వారా జోషిమఠ్‌లోని ఆసుపత్రికి తరలించారు.
నిన్న రక్షించబడిన వారిలో నలుగురి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. హిమాలయాల్లో ప్రతేడాది శీతాకాలంలో మంచు చరియలు విరిగిపడటం సహజమైన విషయమే.
ఈ మంచు చరియలు కేవలం 5 సెకన్ల వ్యవధిలోనే గంటకు 80 మైళ్ల వేగంతో కిందికి జారుతాయి.
Details
గట్టి ప్రయత్నాలు చేస్తున్న ఆర్మీ, సహాయక బృందాలు
ఒకసారి చరియ విరిగిపడితే దాదాపు 2.3 లక్షల ఘనపు మీటర్ల మంచు కిందికి పడుతుంది.
ఇది 20 ఫుట్‌బాల్ మైదానాలను 3 మీటర్ల మందమైన మంచుతో కప్పేసేంత పరిమాణం. ఇలాంటి ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని 18 నిమిషాల్లోగా కాపాడితే 91శాతం బతికే అవకాశాలు ఉంటాయి.
కానీ, సహాయక చర్యలు ఆలస్యమైతే ప్రాణాలను కాపాడుకునే అవకాశాలు తగ్గిపోతాయి. ఉదాహరణగా, 35 నిమిషాలు దాటితే జీవించగలిగే అవకాశం 34శాతం మాత్రమే ఉంటుంది.
ప్రస్తుతం భారత ఆర్మీ, స్థానిక సహాయక బృందాలు మిగిలిన 8 మంది కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.