Tirupati Murder:తిరుపతిలో దారుణం.. డబ్బు కోసం 8ఏళ్ల మేనల్లుడిని హత్య చేసిన మహిళ
తిరుపతిలోని వరదయ్యపాలెం మండలం కాంబాకం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డబ్బుల కోసం ఓ మహిళ 8 ఏళ్ల బాలుడ్ని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాతో కలిసి తన మేనల్లుడిని కిడ్నాప్ చేసి హత్య చేసింది. డబ్బు కోసమే ఆమె ఇంతటి దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. రేఖ అనే మహిళ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఎనిమిదేళ్ల హనీశ్ అనే బాలుడ్ని కిడ్నాప్ చేసింది. రూ. 25 లక్షల కోసం కిడ్నాపర్లతో చేతులు కలిపి హనీశ్ ను అపహరించి తిరుపతి జిల్లాకు తీసుకొచ్చింది. అక్కడే హనీశ్ ను చంపి ఓ గోనె సంచిలో మూట కట్టి ముళ్లపొదల్లో పడేసి వెళ్లింది.
నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు
ముళ్లపొదల్లో బాలుడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఈ దారుణానికి పాల్పడింది రేఖ అనే మహిళ అని పోలీసులు గుర్తించారు. తర్వాత నిందితురాలైన రేఖను పోలీసులు అరెస్టు చేశారు.