AAP: ప్రధాని నివాసం ముందు ఆప్ నిరసన.. అనుమతి లేదన్న ఢిల్లీ పోలీసులు
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముట్టడికి (Gherao)పిలుపునిచ్చింది. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆప్ పార్టీ నేతలు ఢిల్లీలోని పటేల్ చౌక్ ప్రాంతానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి తుగ్లక్ రోడ్డు మీదుగా లోక్‌మాన్య మార్గ్‌లో అత్యంత భారీ భద్రత నడుమ ఉండే ప్రధాని మోదీ నివాసానికి బయల్దేరనున్నారు. ఆప్ ఆందోళనకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఇప్పటికే పోలీసులు పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆప్ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ వాహనదారులకు పోలసులు పలు సూచనలు చేశారు.ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు.
దేశవ్యాప్త ఆందోళనలకు ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపు
తుగ్లక్ రోడ్డులో, సఫ్దర్‌గంజ్ రోడ్డు, కేమల్ అటటుర్ మార్గ్‌లో వాహనాలను నిలపడం గానీ, పార్కింగ్ చేయడానికి గానీ అనుమతి లేదని స్పష్టం చేశారు. మనీలాండరింగ్ కేసుతో ముడిపడి ఉన్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి సీఎం కేజ్రీవాల్‌ను ఈ నెల 22న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆప్ అధినేత అక్రమ అరెస్టుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా నేడు ప్రధాని మోదీ ఇంటిని ముట్టడించనుంది. కాగా,ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆప్ నేతలు, కార్యకర్తలు తమ ప్రొఫైల్ చిత్రాలను మార్చారు.