LOADING...
Aarogyasri: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆగస్ట్ 31 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆగస్ట్ 31 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

Aarogyasri: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆగస్ట్ 31 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 22, 2025
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలోని పేదల ఆరోగ్యాన్ని మద్దతుగా నిలిచే ప్రసిద్ధ 'ఆరోగ్యశ్రీ' సేవలు త్వరలో నిలిచిపోనున్నాయి. ఈ ఏడాది ఆగస్ట్ 31 అర్థరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవనున్నాయి. ఈ విషయం గురించి తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (టీఏఎన్‌హెచ్‌ఏ) అధికారిక ప్రకటన చేసింది. టీఏఎన్‌హెచ్‌ఏ తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వం నుంచి బకాయిల చెల్లింపులో ఆలస్యం, ఆసుపత్రులపై ఆర్థిక భారాన్ని తట్టుకోలేని పరిస్థితి కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ మేరకు గురువారం టీఏఎన్‌హెచ్‌ఏ, ఆరోగ్యశ్రీ సీఈవోకు లేఖ రాశి, జనవరిలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూ.1300-1400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

వివరాలు 

వైద్యులు ఆర్థిక భారాన్ని తట్టకోలేక జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి 

టీఏఎన్‌హెచ్‌ఏ అధ్యక్షుడు వడ్డిరాజు రాకేష్ మాట్లాడుతూ, "బకాయిల చెల్లింపులు గణనీయంగా పెరగడం వల్ల కొన్ని చిన్న ఆసుపత్రులను మూసివేయాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది. గత జనవరిలో ప్రభుత్వం 4-5 నెలల్లో బకాయిలను చెల్లిస్తామని, అలాగే ఆరోగ్యశ్రీ ప్యాకేజీలను సవరిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆరు నెలలు గడిచినా ఎలాంటి అమలు జరగలేదు. వైద్యులు ఆర్థిక భారాన్ని తట్టకోలేక జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది," అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిల పెండింగ్ అంశం గురించి గతంలోనే టీఏఎన్‌హెచ్‌ఏ హెచ్చరికలు జారీ చేసింది అయితే, ప్రభుత్వం ఈ హెచ్చరికలను సీరియస్‌గా పరిగణించకపోవడంతో, ఇప్పుడు టీఏఎన్‌హెచ్‌ఏ ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది.

వివరాలు 

రూ.1300-1400 కోట్ల బకాయిలు పెండింగ్‌లో..

ప్రస్తుతానికి, రాష్ట్రవ్యాప్తంగా 471 ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద పనిచేస్తున్నాయి. మొత్తం రూ.1300-1400 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని టీఏఎన్‌హెచ్‌ఏ పేర్కొంది. ఈ పరిస్థితిలో, ఆగస్ట్ 31 నుంచి ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని టీఏఎన్‌హెచ్‌ఏ నిర్ణయం తీసుకుంది. అలాగే, ఆరోగ్యశ్రీతో పాటు, జర్నలిస్టులు, ఉద్యోగుల హెల్త్ స్కీమ్స్ కూడా తాత్కాలికంగా నిలిచిపోవడానికి ఏర్పాట్లు జరుగుతాయని సమాచారం.