హిందీ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు బీజేపీ
ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరగనున్న హిందీ రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ముందుకెళ్లాలని భావిస్తోంది. అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా, సమిష్టి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. అయితే ఆయనను ఇప్పటి వరకు సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశార్థకమైంది. అధికార వ్యతిరేకతను ఎదుర్కోవడానికి బీజేపీ ఈ సారి శివరాజ్ చౌహాన్‌ను పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు పూర్తయ్యాక పార్టీ శాసనసభ నాయకుడిగా మరొకరిని అదిష్టానం ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాజస్థాన్‌లో వసుంధర రాజే వైపే మొగ్గు
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో తొలిసారిగా ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండానే బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించుకుంది. సింధియా రాజకుటుంబానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సీఎం రేసులో ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో వసుంధర రాజేను సీఎం అభ్యర్థికాగ ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. కాని చెప్పలేదు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా సీఎం రేసులో ఉన్నారు. సీఎం అభ్యర్థి లేకుండా, ప్రధాని మోదీ ఇమేజ్‌తోనే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలో బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్. అరుణ్ సావోలు సీఎం రేసులో ఉన్నారు.