Amitabh Jha: ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళం కమాండర్ బ్రిగేడియర్ అమితాబ్ ఝా మరణం..
ఇజ్రాయిల్, సిరియా సరిహద్దుల్లో గోలన్ హైట్స్‌లో ఐక్యరాజ్య సమితి డిసెంగేజ్‌మెంట్ అబ్జర్వర్ ఫోర్స్ (యుఎన్‌డిఓఎఫ్) డిప్యూటీ ఫోర్స్ కమాండర్ (డిఎఫ్‌సి)గా పనిచేసిన బ్రిగేడియర్ అమితాబ్ ఝా మరణించినట్లు భారత సైన్యం ప్రకటించింది. మరణానికి ముందు ఆయన మిషన్ యాక్టింగ్ ఫోర్స్ కమాండర్‌గా కూడా ఉన్నారు. ఆయన అకాల మరణం పట్ల భారత సైన్యం ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. జనరల్ ఉపేంద్ర ద్వివేది సహా సీనియర్ సైనికాధికారులు బాధిత కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. అయితే, ఆయన మృతికి గల కారణాలను భారత సైన్యం వెల్లడించలేదు. ప్రస్తుతం ఆయన భౌతికకాయం భారత్ చేరుకోగా, దేశానికి, అంతర్జాతీయ సమాజానికి ఆయన చేసిన సేవలకు గౌరవప్రదమైన వీడ్కోలు కార్యక్రమాలు జరుగుతున్నాయి.
సిరియన్ ప్రభుత్వ బలగాలు, తిరుగుబాటు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు
గోలన్ హైట్స్ 1974 నుంచి యుఎన్‌డిఓఎఫ్ పర్యవేక్షణలో ఉండే బఫర్ జోన్‌గా ఉంది, ఇది ఇజ్రాయిల్, సిరియా మధ్య శత్రుత్వాన్ని నివారించేందుకు యోమ్ కిప్పూర్ యుద్ధం అనంతరం ఏర్పాటు చేయబడింది. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో సిరియన్ ప్రభుత్వ బలగాలు, తిరుగుబాటు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకోగా, శాంతి పరిరక్షణ దళం, అలాగే సాధారణ ప్రజలు భద్రతా సమస్యలను ఎదుర్కొన్నారు. బ్రిగేడియర్ ఝా కాల్పుల విరమణ ఒప్పందాలను పర్యవేక్షించడంలో, మానవతా సహాయ కార్యక్రమాలను సులభతరం చేయడంలో, అలాగే ఎదురుకాల్పుల్లో చిక్కుకున్న పౌరులకు భద్రత కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించారు.