Vishal : సెన్సార్ బోర్డుపై నటుడు విశాల్ ఆరోపణలు.. విచారణ మొదలు పెట్టనున్న సీబీఐ
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కొద్ది రోజుల క్రితం సెన్సార్ బోర్డు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సెన్సార్ బోర్డు అవినీతిమయమైందంటూ నటుడు విశాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై విచారణకు సీబీఐ రంగంలోకి దిగింది. అతను చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ మొదలు పెట్టింది. ఈ కేసులో ముగ్గురు ప్రయివేటు వ్యక్తులతో పాటు పలువురు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పిల్మ్ సర్టిఫికేషన్ అధికారులపై కేసు ఫైల్ అయింది. నిందితుల ఇళ్లలో ఇప్పటికే సోదాలు కూడా మొదలుపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ముంబై సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ కార్యాలయంలో సినిమా సర్టిఫికేషన్ కోసం లంచం తీసుకోవడం ఏంటని విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాల్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ముంబైలోని సీబీఎఫ్‌సీ కార్యాలయంలో 'మార్క్ ఆంటోని' హిందీ వెర్షన్ రిలీజ్ కోసం రూ.6.5 లక్షలు లంచం చెల్లించాల్సి వచ్చిందని, తానే రెండు సార్లు లంచం ఇచ్చానని విశాల్ పేర్కొన్నారు. తన సినీ కెరీర్‌లో ఇప్పటివరకూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని, ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తా అంటూ వీడియోలో వెల్లడించారు. ఇక విశాల్ ఆరోపణలపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పందించింది. సినిమా సర్టిఫికేషన్ కోసం లంచం అడగడం దారుణమని, కేంద్ర ప్రభుత్వం అవినీతిని ఏ మాత్రం సహించదని, దీని వెనుక ఎవరి ప్రమేయం ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.