Rahul Gandhi: గౌతమ్ అదానీపై గందరగోళం.. లోక్‌సభ వాయిదా.. అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్..
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో లంచం ఆరోపణలు, ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిగిన హింసాకాండపై బుధవారం లోక్‌సభలో విపక్షాలు గందరగోళం సృష్టించాయి. ఈ సందర్భంగా విపక్ష ఎంపీలు కూడా నినాదాలు చేశారు. దీంతో తొలుత లోక్‌సభ 12 గంటల వరకు వాయిదా పడినప్పటికీ, ఆ తర్వాత గందరగోళం కొనసాగడంతో రోజంతా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ అదానీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
అదానీ విషయంలో కేంద్ర సర్కార్ వైఖరి ఏమిటో చెప్పాలి: రాహుల్ గాంధీ
"చిన్నారోపణలతో ప్రజలను అరెస్టు చేసే కేంద్రం, ఇంత పెద్ద ఆరోపణల విషయంలో ఎందుకు నిశ్శబ్దంగా ఉంది?" అని ప్రశ్నించారు. అదానీ ఈ ఆరోపణలను అంగీకరిస్తాడని ప్రభుత్వం నమ్ముతుందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. లంచాల ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పదింస్తుందో అని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఇక బీజేపీ ఎంపీ మహేష్ జెఠ్మలానీ మాత్రం ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ను విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ఈ అంశాన్ని పెద్దది చేస్తోందని పేర్కొన్నారు. "భారత గ్రోత్ స్టోరీని అడ్డుకోవడమే యూఎస్ ఆరోపణల ఉద్దేశం," అని ఆయన అన్నారు. అదానీ గ్రూప్ కాంట్రాక్టులు పొందడంలో భారత శత్రు దేశాలను కూడా దాటగలిగిందని అభిప్రాయపడ్డారు.