రాజ్యాంగ పీఠిక నుండి లౌకిక, సామ్యవాద పదాలు తొలగించబడ్డాయి: అధిర్ రంజన్ చౌదరి
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రోజున చట్టసభ సభ్యులకు ఇచ్చిన రాజ్యాంగం,కొత్త కాపీలలో "సెక్యులర్", "సోషలిస్ట్" అనే పదాలు లేవని కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మంగళవారం ఆరోపించారు. ఈ సందర్భంగా వార్తా సంస్థ ANI తో అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ఈరోజు (సెప్టెంబర్ 19) కేంద్రం తమకు అందించిన రాజ్యాంగం కొత్త కాపీలను పట్టుకుని కొత్త బిల్డింగ్ లోకి అడుగుపెట్టామని.. అనంతరం ఆ పుస్తకాన్ని తెరచి చూడగా.. పీఠికలో సెక్యూలర్, సోషలిస్టు పదాలు తొలగించినట్లు గుర్తించామని అధిర్ రంజన్ తెలిపారు. 1976లో చేసిన సవరణ తర్వాత ఈ పదాలు రాజ్యంగంలో జోడించినట్లు తమకు తెలుసన్నారు.కానీ ఈ రోజు రాజ్యంగంలో ఆ పదాలు లేకపోవడం ఆందోళన కలిగించే విషయంగా పేర్కొన్నారు.
ఎంపీల కోసం గిఫ్ట్‌బ్యాగ్‌లో బహుమతులు
అంతకుముందు మంగళవారం, కాంగ్రెస్ నాయకుడు పార్లమెంటులో రాజ్యాంగ ప్రవేశికను చదివేటప్పుడు "సోషలిస్ట్","సెక్యులర్" పదాలను చదివారు. మంగళవారం నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం రోజున పార్లమెంటు సభ్యులు భారత రాజ్యాంగ ప్రతిని, పార్లమెంటుకు సంబంధించిన పుస్తకాలు, స్మారక నాణెం, స్టాంపును అందుకున్నారు. ఎంపీల కోసం ఒక గిఫ్ట్‌బ్యాగ్‌లో ఈ బహుమతులు ఉన్నాయి. కొత్త పార్లమెంట్ సముదాయాన్ని మే 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రెండో రోజు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు కొత్త భవనంలో జరిగాయి. కొత్త పార్లమెంట్ భవనానికి మారడం వల్ల ఉభయ సభల పార్లమెంట్ సిబ్బందికి యూనిఫాంలో కూడా మార్పులు వచ్చాయి. వీరిలో ఛాంబర్ అటెండర్లు, అధికారులు, భద్రతా సిబ్బంది, డ్రైవర్లు,మార్షల్స్ అందరూ ప్రత్యేక సెషన్‌లో కొత్త యూనిఫాం ధరించి కనిపించారు.