Loading...
Adilabad Airfield: ఆదిలాబాద్‌లో రూ.2,278 కోట్ల ఎయిర్‌ఫీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్
ఆదిలాబాద్‌లో రూ.2,278 కోట్ల ఎయిర్‌ఫీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్

Adilabad Airfield: ఆదిలాబాద్‌లో రూ.2,278 కోట్ల ఎయిర్‌ఫీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 27, 2026
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలక మలుపు తిప్పే నిర్ణయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో రూ.2,278.14 కోట్ల అంచనా వ్యయంతో 'ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్' నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. మొత్తం 2,009.23 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపునిస్తూ, భవిష్యత్తులో ప్రాంతీయ విమానయాన రంగానికి కీలక కేంద్రంగా అవతరించనుంది.

వివరాలు 

ప్రయాణికుల విమాన సేవలతో పాటు కార్గో రవాణా,విమానాల మరమ్మత్తు, నిర్వహణ కేంద్రాల ఎర్పాటు 

ఈ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌ను పౌర విమానయానంతో పాటు భారత రక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నారు.

ఇందులో ప్రయాణికుల విమాన సేవలతో పాటు కార్గో రవాణా, విమానాల మరమ్మత్తు, నిర్వహణ (ఎంఆర్ఓ) కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఈ సదుపాయాలు అందుబాటులోకి రావడంతో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల రవాణా మరింత వేగవంతం కానుండగా, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించడంతో పాటు పర్యాటక రంగానికీ కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.

అలాగే స్థానిక యువతకు ప్రత్యక్ష, పరోక్షంగా వేలాది ఉద్యోగాలు లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

వివరాలు 

డిసెంబర్ 31 నాటికి భూసేకరణ,ప్రాథమిక మౌలిక సదుపాయాల మార్పిడి

ఈ ప్రాజెక్టు అమలుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

ఎయిర్‌ఫీల్డ్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణతో పాటు ప్రాథమిక మౌలిక సదుపాయాల మార్పిడి పనులను 2026 డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక, వాణిజ్య, రవాణా రంగాలకు మరింత వేగం చేకూరనుంది.

ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుపడటంతో పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

ADVERTISEMENT