Operation Bhediya: యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లాను తోడేళ్ల గుంపు భయబ్రాంతులకు గురిచేస్తోంది. గత కొన్నినెలలుగా మహసి ప్రాంతంలో ఈ జీవాల వరుస దాడుల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి అధికారులు 'ఆపరేషన్ భేడియా'(Operation Bhediya) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ, దాడులు ఆగడం లేదు. తాజాగా, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తోడేళ్లు కనిపిస్తే కాల్చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెలువడ్డాయి. అటవీశాఖ అధికారులు మొత్తం ఆరు తోడేళ్లతో కూడిన గుంపు సంచరిస్తోందని గుర్తించారు. 'ఆపరేషన్ భేడియా'లో భాగంగా ఇప్పటివరకు నాలుగు తోడేళ్లను పట్టుకున్నారు, కానీ మిగిలిన రెండింటిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
'ఆపరేషన్ భేడియా'పై యోగి ఆదిత్యనాథ్ సమీక్ష
ఇంతలోనే మరో దాడి జరిగింది, ఐదేళ్ల పాపపై సోమవారం రాత్రి దాడి జరిగింది. ఇప్పటివరకు తోడేళ్ల దాడుల్లో 10 మంది మరణించగా, దాదాపు 30 మందికిపైగా గాయపడ్డారు.మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులే కావడం గమనార్హం. తాజాగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉన్నత స్థాయి అధికారులతో సమావేశమై 'ఆపరేషన్ భేడియా'పై సమీక్ష నిర్వహించారు. పట్టుకోవడం సాధ్యం కాకపోతే తోడేళ్లను కాల్చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆ నిర్ణయాన్ని చివరి అవకాశంగా పరిగణించాలని పేర్కొన్నారు. బహరాయిచ్ జిల్లా కలెక్టర్ రాణి మాట్లాడుతూ, ప్రతి నాలుగు లేదా ఐదు రోజులకు ఒకసారి తోడేళ్లు కొత్త గ్రామంపై దాడి చేస్తున్నాయని, దీనివల్ల పరిస్థితిని అంచనా వేయడం సవాలుగా మారిందని చెప్పారు.