Page Loader
Air India: జులై వరకూ ఎయిర్ ఇండియా వైడ్-బాడీ విమానాల అంతర్జాతీయ సేవలు  15% తగ్గింపు 
జులై వరకూ ఎయిర్ ఇండియా వైడ్-బాడీ విమానాల అంతర్జాతీయ సేవలు 15% తగ్గింపు

Air India: జులై వరకూ ఎయిర్ ఇండియా వైడ్-బాడీ విమానాల అంతర్జాతీయ సేవలు  15% తగ్గింపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ (ఫ్లైట్ AI171) జూన్ 12న టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ విషాదకర ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రయాణికులు,సిబ్బందంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనను దేశంలో గత కొన్ని దశాబ్దాల్లో సంభవించిన అత్యంత తీవ్రమైన విమాన ప్రమాదాల్లో ఒకటిగా గుర్తించారు. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా, గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు తలెత్తకుండా నిరోధించేందుకు భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తమ అంతర్జాతీయ విమాన సర్వీసుల సంఖ్యను తాత్కాలికంగా 15 శాతం తగ్గిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

వివరాలు 

DGCA సూచన ప్రకారం మెరుగైన భద్రతా తనిఖీలు అమలు 

ఎయిర్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం, సివిల్ ఏవియేషన్ నియంత్రణ సంస్థ అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సూచించిన ఆధారంగా "ఎన్హాన్స్‌డ్ సేఫ్టీ ఇన్‌స్పెక్షన్" (మెరుగైన భద్రతా తనిఖీలు) కార్యక్రమాన్ని సంస్థ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తమకు చెందిన 33 బోయింగ్ 787-8 ,787-9 విమానాల్లో ఇప్పటివరకు 26 విమానాల తనిఖీలు పూర్తయ్యాయి. అవన్నీ సేవలందించేందుకు అనుమతించబడ్డాయి.మిగిలిన 7 విమానాల తనిఖీలు కూడా త్వరలో పూర్తవుతాయని సంస్థ తెలిపింది. అదనంగా, మరిన్ని జాగ్రత్త చర్యలతో భాగంగా బోయింగ్ 777 విమానాలపై కూడా సమగ్ర భద్రతా తనిఖీలు చేయనున్నట్లు పేర్కొంది. విమాన సేవలను తాత్కాలికంగా తగ్గించే ఈ నిర్ణయం వెనుక పలు కారణాలున్నాయని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.

వివరాలు 

ఆరు రోజుల్లో ఏకంగా 83అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు 

వాటిలో ప్రధానంగా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు,యూరప్,తూర్పు ఆసియా దేశాల్లో రాత్రి సమయంలో అమలవుతున్న విమానాశ్రయ నిషేధాలు,స్థిరంగా కొనసాగుతున్న భద్రతా తనిఖీల ప్రభావం,ఇంజినీరింగ్ సిబ్బంది,పైలట్లు తీసుకుంటున్న అధిక జాగ్రత్తలు వంటి అంశాలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గత ఆరు రోజుల్లో ఏకంగా 83 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు, విమానాల స్థిరత, సామర్థ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు, సంస్థ ప్రస్తుతం సేవలలో ఉపయోగిస్తున్న వైడ్-బాడీ విమానాల ఆధారంగా నడిచే అంతర్జాతీయ సర్వీసులను రాబోయే కొన్ని వారాలపాటు 15 శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తాత్కాలిక తగ్గింపు జూన్ 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, ఇది కనీసం జూలై మధ్య వరకు కొనసాగే అవకాశముందని సంస్థ పేర్కొంది.