
Omar Abdullah: అత్యవసరంగా జమ్మూకు ఒమర్ అబ్దుల్లా.. పరిస్థితిని సమీక్షించనున్న సీఎం
ఈ వార్తాకథనం ఏంటి
జమ్మూలోని పలు ప్రాంతాలపై గురువారం పాకిస్థాన్ డ్రోన్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.
అయితే, భారత సాయుధ దళాలు వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి.ఈపరిణామాల నేపథ్యంలో, ఉత్కంఠ భరితంగా ఉన్న పరిస్థితిని సమీక్షించేందుకు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్ నుంచి బయలుదేరి జమ్మూకు వెళ్లారు.
జమ్మూ నగరంతో పాటు డివిజన్‌లోని ఇతర ప్రాంతాల్లో పాకిస్తాన్ చేపట్టిన విఫల దాడుల నేపథ్యంలో అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు తన ప్రయాణం జరుగుతుందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
జమ్మూ,సాంబా,ఆర్‌ఎస్‌పురా తదితర ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు,చిన్నశ్రేణి క్షిపణులతో దాడికి ప్రయత్నించినప్పటికీ భారత సైన్యం అప్రమత్తంగా స్పందించి వాటిని ఎదుర్కొంది.
అంతేకాక,పాకిస్తాన్ సైన్యం సహకారంతో అక్కడ ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దులోని సాంబాజిల్లాలో చొరబాటుకు యత్నించారు.
వివరాలు
పాకిస్తాన్ భారీ మోర్టార్లతో దాడులు.. మహిళ మృతి
గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో వారు అంతర్జాతీయ సరిహద్దును దాటి చొరబడేందుకు ప్రయత్నించగా, బీఎస్‌ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం) సమయానికి స్పందించి ఆ కుట్రను భగ్నం చేసింది.
ఈ నేపథ్యంలో, బీఎస్‌ఎఫ్ ప్రతినిధి ఒక ప్రకటనలో మాట్లాడుతూ - "మేము వేగంగా చర్యలు తీసుకోవడంతో ఉగ్రవాదులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది," అని తెలిపారు.
ఇదే సమయంలో, బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్‌లో పౌర నివాసాలపై పాకిస్తాన్ భారీ మోర్టార్లతో దాడులు జరిపింది.
ఈ దాడిలో నర్గీస్ బేగం అనే మహిళ మృతి చెందారు. మరో మహిళ హఫీజా బేగం గాయపడ్డారు. అధికారులు వెల్లడించిన ప్రకారం, బారాముల్లా వెళ్తున్న ఒక వాహనంపై మోహురా సమీపంలో నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరగాయి.
వివరాలు
పాక్ సైన్యం డ్రోన్లు, చిన్నశ్రేణి క్షిపణుల ప్రయోగం
అంతేకాక, పాకిస్తాన్ సైన్యం ఉరి, తంగ్ధర్, పూంచ్, రాజౌరి నియంత్రణ రేఖ ప్రాంతాల్లో, అంతర్జాతీయ సరిహద్దులోని సాంబాలో భారీ మోర్టార్ దాడులు కొనసాగించిందని సైనిక అధికారులు పేర్కొన్నారు.
జమ్మూ విమానాశ్రయం లక్ష్యంగా పాక్ సైన్యం డ్రోన్లు, చిన్నశ్రేణి క్షిపణులు ప్రయోగించగా, భారత రక్షణ వ్యవస్థలు వాటిని గాలిలోనే నాశనం చేసినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.