LOADING...
Sam Pitroda: ఐఐటీ రాంచీ తర్వాత.. రూర్కీలోనూ జూమ్‌ మీటింగ్‌ హ్యాక్.. శామ్‌ పిట్రోడా ఆరోపణ 
ఐఐటీ రాంచీ తర్వాత.. రూర్కీలోనూ జూమ్‌ మీటింగ్‌ హ్యాకింగ్‌.. శామ్‌ పిట్రోడా ఆరోపణ

Sam Pitroda: ఐఐటీ రాంచీ తర్వాత.. రూర్కీలోనూ జూమ్‌ మీటింగ్‌ హ్యాక్.. శామ్‌ పిట్రోడా ఆరోపణ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2025
03:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌ పిట్రోడా మరోసారి తన వర్చువల్‌ ప్రసంగం హ్యాక్‌ చేసినట్లు ఆరోపించారు. గతంలో ఐఐటీ రాంచీ విద్యార్థులతో వర్చువల్‌గా మాట్లాడుతుండగా ఇలాంటి ఘటన ఎదురైందని ఆయన పేర్కొనగా, ఇప్పుడు ఐఐటీ రూర్కీలోనూ అదే అనుభవం ఎదురైందని వెల్లడించారు. ఈమేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ఓ పోస్టు చేశారు. పిట్రోడా తన పోస్టులో ఫిబ్రవరి 1న కాగ్నిజెంట్‌ ఈవెంట్ సందర్భంగా ఐఐటీ రూర్కీలో విద్యార్థులు, అధ్యాపకులతో జూమ్‌ మీటింగ్‌లో పాల్గొనాలని తనకు ఆహ్వానం అందిందన్నారు. కానీ మీటింగ్ ముగిసిన కొద్ది నిమిషాలకే అది హ్యాక్ చేశారన్నారు. హ్యాకింగ్ తర్వాత అసభ్యకరమైన వీడియోలు ప్రసారమయ్యాయని, ఇది నిజంగా విచారకరమన్నారు.

Details

 ఇంతకుముందు కూడా ఇదే తరహా ఘటన 

విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు జరగడం సైబర్ భద్రతపై ఉన్న అంతరాలను హైలైట్ చేస్తుందన్నారు. డిజిటల్ భద్రత, అప్రమత్తత ఎంత ముఖ్యమో ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఐఐటీ రాంచీలో వర్చువల్‌గా ప్రసంగిస్తుండగా, తన సమావేశాన్ని ఎవరో హ్యాక్ చేశారని, దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? విద్యాసంస్థలకు స్వయంప్రతిపత్తి ఉండటమే నిజమైన ప్రజాస్వామ్యం కాదా? అని ప్రశ్నించారు.

Details

 కేంద్ర విద్యాశాఖ స్పందన 

పిట్రోడా ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ స్పందించింది. ఆయన పేర్కొన్న విద్యాసంస్థ ఐఐటీ రాంచీ కాదని, అది ఐఐఐటీ (ఇండియన్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్) అని స్పష్టంచేసింది. అంతేకాకుండా ఆ విద్యాసంస్థ ఆయనతో ఎలాంటి వర్చువల్‌ సమావేశం నిర్వహించలేదని ధృవీకరించింది. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలపై నిరాధార ఆరోపణలు చేస్తే, న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది