Delhi-Kejriwal-Supreme Court: బెయిల్ కోసం ట్రయిల్ కోర్టులో ఎందుకు పిటిషన్ వేయలేదు?: కేజ్రీవాల్ ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Case) కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) పై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్ ఫోర్స్ మెం ట్ డైరెక్టరేట్ (ED)తనను అరెస్టు చేయడానికి సవాలు చేస్తూ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు వేసింది. ఈ కేసులో బెయిల్ కోసం ట్రయిల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని కేజ్రీవాల్ ను ప్రశ్నించింది. అసలు బెయిల్ కోసం ట్రయిల్ కోర్టులో పిటిషన్ వేశారా లేదా అని కేజ్రీవాల్ తరఫు లాయర్ అభిషేక్ మను సింఘ్విని అడిగింది.
ఈడీ కి ఆ అధికారం ఉంది: సుప్రీం కోర్టు
సింఘ్వి సమాధానం ఇస్తూ ....తాము ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని చెప్పారు. ఈడి ఇచ్చిన సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాలేదన్న కారణం తోనే ఆయనను అరెస్టు చేశారని ఇది సరికాదని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కలగజేసుకుంటూ...పీఎంఎల్ఏ సెక్షన్ 50 ప్రకారం ఈడి అధికారులు సమన్లు జారీ చేసే అధికారం ఉందని..అలా సమన్లు జారీ చేసినప్పుడు వారికి ఆధారాలను సమర్పించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. మీరు వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు అంగీకరించకపోతే మిమ్మల్ని మీరు కాపాడుకోలేరని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. వాదనల అనంతరం విచారణను .సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది